ఎదులాపురం, మార్చి 6 : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న డిమాండ్ చేశారు. శుక్రవారం ఆదిలాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో రైతు భరోసా నిధుల విడుదలకై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి కోసం రైతుల సంతకాల సేకరణపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇందులో ఈ నెల 7 నుంచి చేపట్టే సంతకాల సేకరణపై చర్చించారు.
శనివారం ఆదిలాబాద్ రూరల్ మండలంలో బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికీ తిరుగుతూ సంతకాలను సేకరిస్తారని చెప్పారు. అధికారంలోకి రాకముందు సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా పేరిట రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తామని చెప్పి రెండేళ్లయినా ఎలాంటి ఉలుకు పలుకు లేదని జోగు రామన్న మండిపడ్డారు. ఈ నెల 16 నుంచి అసెంబ్లీ సమావేశాల్లో ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతు భరోసా నిధులు విడుదల చేయాలనే డిమాండ్‌తో రైతుల వద్ద నుంచి సంతకాల సేకరణ చేస్తామన్నారు.
జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల మంది రైతులున్నాయని, నియోజకవర్గంలో 60 వేల వరకు రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. వారికి పెట్టుబడి సాయం అందించాలని బీఆర్ఎస్ తరపున డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టామన్నారు. ప్రత్యేక ప్రొఫార్మతో వచ్చే బీఆర్ఎస్ నాయకులకు గ్రామాల్లో రైతులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రౌతు మనోహర్, నాయకులు ప్రహ్లాద్, రాజు, లింగారెడ్డి, నారాయణ, దాసరి రమేశ్, జగదీశ్, గండ్రత్ రమేశ్, సతీశ్ పవార్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.