యాదాద్రి భువనగిరి, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) తుది దశకు చేరుకుంది. ఇప్పటికే రెండు దఫాలుగా సర్ తేదీలు పొడిగించగా, సోమవారంతో ఓట్లర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ముగియనుంది. దీంతో ఎంత మంది ఓటర్లు తమ ఫారాలను సమర్పించలేదో తేలిపోతుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం సర్‌లో ఇప్పటి వరకు ఉమ్మడి నల్లగొండలో 2.63 లక్షల ఓట్లు తొలగించినట్లు తెలుస్తున్నది. ఇక తెలంగాణలోనే యాదాద్రి భువనగిరి జిల్లా సర్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచి రికార్డు నెలకొల్పింది.
ఈ నెల 17న ముసాయిదా జాబితా ప్రచురిస్తారు. ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దేందుకు, చనిపోయిన లేదా ఇండ్లు మారిన వారి ఓట్లను తొలగించేందుకు, డూప్లికేట్, డబుల్ ఓట్లను తొలగించేందుకు, కొత్త ఓటర్లను చేర్చడానికి దేశ వ్యాప్తంగా సర్ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా గత నెల 24వ తేదీ లోగా సర్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. అయితే కొన్ని జిల్లాలో జాప్యం కావడంతో రెండు సార్లు రీషెడ్యూల్ చేశారు. సోమవారంతో సర్ ప్రక్రియ ముగుస్తుంది. ఈ నెల 17న ముసాయిదా జాబితా ప్రచురిస్తారు. సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. అక్టోబర్ 19న తుది జాబితా విడుదల చేస్తారు.
2.63 లక్షల ఓట్లు అన్‌కలెక్టబుల్..
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు, భువనగిరి నియోజకర్గాల్లో మొత్తం 4,59,943 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఆలేరులో 2,38,040, భువనగిరి నియోజకవర్గంలో 2,21,903 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరికీ ఇంటింటికి తిరిగి బీఎల్వోలు ఫారాలు అందజేశారు. అయితే ఓటర్లు ఫారాలను నింపి తిరిగి సమర్పించాల్సి ఉంటుంది. వీటిని బీఎల్వోలు డిజిటలైజేషన్ చేస్తున్నారు. యాదాద్రి జిల్లాలో ఇప్పటి వరకు 94.30 శాతం ఎన్యుమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ చేశారు. ఇంకా 5.70 శాతం ఓటర్లు తమ పత్రాలు తిరిగి సమర్పించలేదు. దీన్ని అన్కలెక్టెబుల్గా నిర్ధారించారు. అంటే జిల్లాలో ఇప్పటి వరకు 26,222 ఓట్లు పోయినట్లేనని అధికారులు చెబుతున్నారు. ముసాయిదా తర్వాత ఈ సంఖ్యలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంటుంది.
నల్లగొండలో మొత్తం 15,16,253 ఓటర్లు ఉండగా, 89.43 శాతం మాత్రమే డిజిటలైజేషన్ పూర్తయింది. అంటే 1.60 లక్షల ఓట్లు పోయినట్లే. ఇక సూర్యాపేట జిల్లాలో 10,08,252 ఓట్లర్లు ఉండగా, 90.43 శాతం ఫారాలు మాత్రమే తిరిగి ఇవ్వడంతో డిజిటలైజేషన్ చేశారు. దీంతో ఇక్కడ 96,523 ఓట్లు లేనట్లే. దీంతో ఈ అన్‌కలెక్టబుల్ ఓట్లరు దాదాపు తొలగిపోయినట్లేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే డూప్లికేట్, డబుల్ ఓట్లు, చనిపోయినవారు, షిఫ్టింగ్ ఓటర్లు తమ ఫారాలను తిరిగి ఇవ్వలేదని పేర్కొంటున్నారు. అయితే అధిక శాతం మందికి సొంతూర్లతోపాటు హైదరాబాద్‌లో ఓట్లు ఉండటంతో గ్రామాల్లోనే ఓటు ఉంచుకునేందుకు ఆసక్తి చూపించారు. ఇక జిల్లాలోని పోలింగ్ కేంద్రాల సర్దుబాటు, రేషనలైజేన్ ప్రక్రియ పూర్తి చేశారు.
సర్‌లో యాదాద్రి టాప్
సర్ ప్రక్రియలో రాష్ట్రంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. అటు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీలో తొలుత వంద శాతం పూర్తి చేసింది. ఇటు డిజిటలైజేషన్‌లోనూ టాప్ ప్లేస్‌లో ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు 94.30 శాతం ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయింది. ఆలేరు నియోజకవర్గంలో 95.69 శాతం ఆన్లైన్ చేయడం విశేషం. భువనగిరి అసెంబ్లీ పరిధిలో 92.81 శాతం ఫారాలు ఆన్లైన్ చేశారు. మండలాల వారీగా చూస్తే రాజాపేటలో 96.95 శాతం ఆన్లైన్ చేశారు. గుండాలలో 96.73 శాతం, బొమ్మల రామారంలో 96.56 శాతం, యాదగిరిగుట్టలో 95.92శాతం, మోటకొండూరులో 95.80 శాతం ఫారాలను డిజిటలైజేషన్ చేశారు. అర్బన్ ఏరియా అధికంగా ఉన్న భువనగిరి మండలంలో 7489 ఓట్లు అన్కలెక్టబుల్గా నిర్ధారించారు.
