హాలియా, మార్చి 6 : కాంగ్రెస్ నేతలు గిరిజనులను ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వాడుకున్నారే తప్ప ఏనాడూ వారి అభ్యున్నతికి పాటుపడిన దాఖలాలు లేవు. 2014లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం గిరిజనులు, ఆదివాసీల వెనుకబాటు తనాన్ని రూపుమాపడం కోసం గిరిజన తండాలను పంచాయతీలు చేయడంతో పాటు 6 శాతం ఉన్న రిజర్వేషన్‌ను 10 శాతానికి పెంచి విద్య, ఉద్యోగాల్లో అవకాశాలను కల్పించారు. గిరిజనుల అభ్యున్నతే లక్ష్యంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. గిరిజనులు ఆత్మగౌరవంతో జీవించేందుకు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో రూ.500 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడంతో పాటు రూ.50 కోట్లతో సంత్ సేవాలాల్ పేరుతో బంజారా భవన్ నిర్మించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియా లాంటి మండల కేంద్రంలో సైతం బంజారా భవన్ ఏర్పాటు చేసేందుకు రూ.3 కోట్లు విడుదల చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన గిరిజన భవన్ ఫిబ్రవరి 23న ప్రారంభం కావడంతో సాగర్ నియోజకవర్గ గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
హాలియాలో బంజారా భవన్ ఏర్పాటు చేయాలన్నది ఈ ప్రాంత గిరిజనుల చిరకాల కోరిక. 30 సంవత్సరాలుగా గిరిజన ప్రజాప్రతినిధులు, గిరిజనులు, లంబాడా సంఘం నాయకులు హాలియాలో బంజారా భవన్ ఏర్పాటుకు ఎంతగానో కృషి చేసినా ఫలితం లేదు. కారణం 7 సార్లు ఎమ్మెల్యేగా, 16 ఏళ్ల పాటు మంత్రిగా కొనసాగిన కుందూరు జానారెడ్డికి చిత్తశుద్ధి లేకపోవడమే ఇందుకు నిదర్శనం.
హాలియాలో బంజారా భవన్ ఏర్పాటు చేయాల్సిందిగా ఈ ప్రాంత గిరిజన నాయకులు 2021లో సాగర్ ఉప ఎన్నిక సమయంలో నాటి సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన కేసీఆర్ ఉప ఎన్నికల అనంతరం హాలియాలో బంజారా భవన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. బంజారా భవన్ నిర్మాణం కోసం ఎకరం ప్రభుత్వ భూమిని కేటాయించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ అధికారులు హాలియాలో బంజారా భవన్ నిర్మాణం కోసం ఎకరం స్థలం కేటాయించారు. భవన నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని కోరుతూ నాటి ఎమ్మెల్యే నోముల భగత్, రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్ నాయక్ రాష్ట్ర గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను కలిసి విన్నవించారు. వెంటనే స్పందించిన ఆమె రూ.2 కోట్లు విడుదల చేశారు. నోముల భగత్ సైతం నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి మరో రూ.కోటి విడుదల చేశారు. మొత్తం రూ.3 కోట్లతో బంజారా భవన్ నిర్మాణం పూర్తయింది.