అక్కడ కరకట్ట కట్టలేదు.. కానీ, రికార్డుల ప్రకారం కట్టని కరకట్ట వరదలో కొట్టుకపోయింది. అందుకు అయిన ఖర్చు 30 లక్షలు. ఈ బిల్లులు కూడా చకచకా ప్రిపేర్ అయ్యాయి. ఆ మేరకు డబ్బులు డ్రా చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఈ వ్యవహారంలో ఓ అధికారి చక్రం తిప్పారు. ఆయన అండతోనే లేని కరకట్ట వరదలో కొట్టుకపోయినట్టు రికార్డులు సృష్టించి, ఏకంగా బిల్లులు డ్రా చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే ఈ ప్రక్రియ అక్కడితో ఆగలేదు. అదే స్థానంలో కొత్తగా 40 లక్షల అంచనాలతో సీసీ వాల్ నిర్మించి, బిల్లులను సైతం తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తాజాగా వెలుగులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం జయవరం మూలవాగుపై నిర్మించిన చెక్‌డ్యాంలో జరుగుతున్న ఈ అవినీతి బాగోతం, తీవ్ర ఆరోపణలకు తావిస్తున్నది.
కరీంనగర్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మెట్టప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టి.. సాగునీటి రంగానికి దన్నుగా నిలువడంతోపాటు భూగర్భజలాలు పెంచాలన్న లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మానేరుతోపాటు మూలవాగుపై చెక్‌డ్యాంల నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ఆ మేరకు మూలవాగుపై దాదాపు 15 చెక్‌డ్యాంలు నిర్మించేందుకు పర్మిషన్ అప్పుడే రాగా, వేములవాడ రూరల్ మండలం జయవరం వద్ద మూలవాగుపై 6.2 కోట్లతో చెక్‌డ్యాం నిర్మించారు. ఈ చెక్ డ్యాం నిర్మాణం ఆది నుంచీ వివాదాస్పదంగా మారింది. నిజానికి ఈ చెక్‌డ్యాంను దక్కించుకున్న అసలు గుత్తేదారు పనులు చేయకుండా సబ్‌కాంట్రాక్టర్లకు ఇచ్చారు. పనులు మొదలు పెట్టిన సబ్ కాంట్రాక్టర్ అప్పుడే అక్రమాలకు తెరలేపారు. మూలవాగు ఎఫ్టీఎల్ పరిధిలోనే కాంక్రీట్ మిక్సింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసి, చెక్ డ్యాం నిర్మాణాన్ని సాకుగా చూపి మిక్సింగ్ చేసిన కాంక్రీట్‌ను వివిధ ప్రాంతాలకు విక్రయించారన్న ఆరోపణలు అప్పట్లోనే వచ్చాయి. అయితే చెక్‌డ్యాం నిర్మాణం కోసమే కాంక్రీట్ మిక్సింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేశామంటూ సదరు సబ్ కాంట్రాక్టర్, సమీప రైతులను నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ, ఆరోపణల నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని విచారణ జరిపింది.
అధికారుల నిర్లక్ష్యం.. అవగాహనలేని కాంట్రాక్టర్
ఒక వైపు కాంక్రీట్ మిక్సింగ్ యూనిట్‌తో అక్రమాలకు తెరలేపిన సదరు సబ్ కాంట్రాక్టర్ అక్కడితో ఆగకుండా.. అధికారులను తన వశం చేసుకొని ఇష్టానుసారం చెక్ డ్యాం నిర్మించినట్టు ఆరోపణలు వచ్చాయి. వీటిని పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం మామూళ్లకు తలొగ్గి సలాం కొట్టిందన్న విమర్శలున్నాయి. ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, కాంట్రాక్టర్ల అవగాహనలేమి స్పష్టంగా కనిపించింది. వేములవాడ రూరల్ మండలం జయవరం గ్రామం వద్ద 6.2 కోట్లతో చేపట్టిన చెక్‌డ్యాం నిర్మాణంలో ఒక మీటర్ లోతు నుంచి బేస్ వేసి నిర్మించాల్సి ఉండగా.. ఆ నిబంధనను తుంగలో తొక్కారు. దీంతో మత్తడి కట్ట 3.2 మీటర్ల ఎత్తులో నిర్మించారు. దాదాపు ఒక మీటర్ ఎత్తు పెరగడంతో మత్తడి కింద మొత్తం కొట్టుకుపోయింది. ఇదంతా తెలుసుకున్న గత సర్కారు చర్యలు తీసుకోవడానికి సిద్ధమైన తరుణంలో ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఆ ఎత్తును 2.5 మీటర్లకు కుదించారు. ఈ వ్యవహారంలో ఎత్తు పెరగడం, దానిని కుదించడం వంటి పనుల వల్ల సర్కారుకు దాదాపు 70 లక్షల వరకు నష్టం వాటిల్లింది.
నిర్మించకుండానే కొట్టుకుపోయిందట
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు కథ మొదలైంది. చెక్ డ్యాం పూర్తయిన తర్వాత కరకట్టలు కట్టాలి. ఈ సమయంలోనే అంటే 2023లో భారీ వరద వచ్చింది. చెక్‌డ్యాంను అవగాహన లేకుండా ఎత్తుగా నిర్మించడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, పరీవాహక ప్రాంతంలో పెద్ద మొత్తంలో పంటలు నీట మునిగాయి. ముఖ్యంగా మల్లారం రహదారి వైపు ఉన్న పంట పొలాలు పెద్ద మొత్తంలో కోతకు గురై ఇసుక మేటలు వేశాయి. దీని వల్ల అప్పట్లో రైతులు భారీగా నష్టపోయారు. తమ వైపు కరకట్ట నిర్మించి ఉంటే తమకీ నష్టం వాటిల్లేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా పరిగణలోకి తీసుకోకుండా.. ప్రస్తుత ప్రభుత్వం పగ్గాలు చేపట్టగానే తర్వాత అక్కడ చెక్‌డ్యాంతోపాటు 500 మీటర్ల పొడవుతో కరకట్ట నిర్మాణం జరిగిందని, వరద కారణంగా అది కొట్టుకుపోయిందని, దాని ఖర్చు 30 లక్షలు అంటూ ఎంబీ రికార్డులు సృష్టించారు. అక్కడితో ఆగకుండా ఈ బిల్లులను డ్రా చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఈ తంతంగం వెనుక ఓ అధికారి కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తున్నది. ఆయన ఆదేశాల మేరకే క్షేత్రస్థాయి అధికారులు లేని రికార్డులను సృష్టించినట్టు సమాచారం. నిజానికి ఇక్కడ కరకట్ట కట్టకపోవడం వల్ల తాము నష్టపోయామని రైతులు గతంలో పదే పదే చెప్పగా కరకట్ట కట్టామని, అది కొట్టుకపోయిందని అధికారులు ఏకంగా ఎంబీ రికార్డు చేసి.. డ్రా స్థాయి వరకు వెళ్లిన తీరు తాజాగా వెలుగులోకి రావడం ఆ శాఖలోనే చర్చనీయాంశం అవుతున్నది.
ఇది ఇలా ఉంటే 40 లక్షలతో తాజాగా 6మీటర్ల ఎత్తు, 85 మీటర్ల పొడువు సీసీ వాల్‌ను కట్టారు. ఇప్పుడు ఈ బిల్లులను డ్రా చేయడానికి రికార్డులు సిద్ధం చేశారు. అయితే ఈ నిర్మాణంలోనూ అనేక లోపాలున్నట్టు తెలుస్తున్న ది. ప్రకృతి వైపరీత్యాలను కూడా తమకు అనుకూలంగా మార్చుకొని, అధికారులు కాంట్రాక్టర్లు కలిసి ప్రభుత్వ ఖజానాకు కన్నం వేసిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రభుత్వం స్పందిస్తుందా.. లేదా? అన్నది మున్ముందు తేలనుండగా.. ఈ విషయంలో ఇరిగేషన్ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి భాగస్వామ్యం ఎక్కువగా ఉన్నట్టు ఆ శాఖలో చర్చ జరుగుతున్నది. ఈ విషయంపై ఇరిగేషన్ శాఖ డీఈ శ్రీనివాస్న వివరణ కోరగా, కరకట్టకు సంబంధించి ఎటువంటి డబ్బులు కాంట్రాక్టర్‌కు చెల్లించలేదని తెలిపారు. అయితే కొంతమంది ద్వారా తెలుస్తున్న సమాచారం ప్రకారం చూస్తే.. ఈ బిల్లులు రేపోమాపో పేమెంట్ కానున్నట్టు తెలుస్తున్నదని చెబుతున్నారు.