ఎర్రుపాలెం, ఆగస్ట్ 17 : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వం, వాటిపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజుపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని బీఆర్ఎస్ ఎర్రుపాలెం మండల నాయకులు అన్నారు. ప్రజల సమస్యలపై ప్రశ్నించడం రాజకీయ బాధ్యత అన్నారు. సోమవారం ఎర్రుపాలెంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. ‘‘ఎవరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని, ఆరోపణలు చేసే ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులకు హితవు పలికారు. మధిర నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు మరచిపోలేదన్నారు. 100 పడకల ఆస్పత్రి నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, రహదారుల అభివృద్ధి తదితర పనులు ఎవరి హయాంలో జరిగాయో ప్రజలకు తెలుసన్నారు. కమల్రాజుపై వ్యక్తిగత విమర్శలు చేసే ముందు కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేసుకోవాలన్నారు. ఆ హామీల్లో ఎన్ని అమలు చేశారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
పింఛన్ల పెంపు, మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్, కళాశాల విద్యార్థినులకు స్కూటీలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, నిరుద్యోగ భృతి, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం వంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎర్రుపాలెం మండలంలోని పలు గ్రామాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ముందుగా నెరవేర్చండి. ఆ తర్వాత ప్రతిపక్షాలపై విమర్శలు చేయండి. ఎవరు ప్రజల పక్షాన నిలబడుతున్నారో, ఎవరు మాటలు చెబుతున్నారో ప్రజలే నిర్ణయిస్తారని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ శీలం కవిత, మండల కార్యదర్శి యన్నం శ్రీనివాసరెడ్డి, బొర్రా నరసింహారావు, శేగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, షేక్ మస్తాన్ వలి, కుడుముల మల్లికార్జునరెడ్డి, తిరుపతిరావు, సంక్రాంతి కృష్ణారావు, గద్దల శ్రీనివాసరావు, కూరపాటి నాగేశ్వరరావు పాల్గొన్నారు.