Tamil CM Fitness : తమిళనాడు (Tamil Nadu) రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (Joseph Vijay) 52 ఏళ్ల వయసులోనూ ఎంతో ఫిట్‌గా చురుగ్గా ఉంటారు. ఆయన అంత ఫిట్‌గా ఉండటానికి గల కారణాలను ఆయన ఫిట్నెస్ ట్రెయినర్ (Fitness Trainer) నరేశ్ కుమార్ (Naresh Kumar) వెల్లడించారు. కఠినమైన డైట్ నియమాలు, ఖరీదైన ఆహార పద్ధతులకు బదులుగా.. విజయ్ సాధారణ ఇంటి భోజనం, క్రమమైన వ్యాయామంతోనే తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారని ఆయన వివరించారు. ఈ సింపుల్ విధానమే విజయ్ ఫిట్నెస్ మంత్రమని స్పష్టంచేశారు.
విజయ్ దినచర్య చాలా నిలకడగా ఉంటుందని నరేష్ కుమార్ చెప్పారు. సాధారణంగా ఉదయం 5:30 నుంచి 6 గంటల మధ్య నిద్రలేస్తారని, ఉదయం 9 గంటల సమయంలో అల్పాహారంగా రెండు ఇడ్లీలతోపాటు గుడ్లు తీసుకుంటారని అన్నారు. మధ్యాహ్న భోజనంలో అన్నంతోపాటు కూరగాయలు, పండ్లు, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని ఇష్టపడతారని చెప్పారు. రాత్రి భోజనం చాలా తేలికగా ఉంటుందన్నారు. ఎక్కువగా సూప్ లేదా సలాడ్ వంటివి తీసుకుంటారని తెలిపారు.
ఆయన ఫిట్నెస్ కోసం రుచిలేని ఆహారాన్ని బలవంతంగా తినే రకం కాదని ఫిట్నెస్ ట్రెయినర్ అన్నారు. తనకు ఇష్టమైన సంప్రదాయ దక్షిణ భారత వంటకాలనే పరిమితంగా తీసుకుంటారని చెప్పారు. జంక్ ఫుడ్‌కు పూర్తిగా దూరంగా ఉంటారన్నారు. అప్పుడప్పుడు ఇష్టమైన మటన్ బిర్యానీని ఆస్వాదిస్తారని, అలాగే శక్కరై పొంగల్ వంటి సంప్రదాయ తీపి వంటకాలను కూడా అప్పుడప్పుడు రుచి చూస్తారని చెప్పారు.
ఆహార నియమాలతోపాటు వ్యాయామానికి కూడా విజయ్ అంతే ప్రాధాన్యత ఇస్తారని నరేష్ కుమార్ చెప్పారు. ఒకవేళ జిమ్‌కు వెళ్లడం సాధ్యం కాకపోతే రోజువారీ శారీరక శ్రమను పెంచుకుంటారన్నారు. తీవ్రమైన కసరత్తుల కన్నా నిలకడగా వ్యాయామం చేయడానికే ఆయన మొగ్గు చూపుతారని, ఈ సమతుల్య జీవనశైలే ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన శక్తిని అందిస్తుందని విజయ్ సన్నిహితులు చెబుతున్నారు.