Netflix | ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రేక్షకాదరణ పొందిన రెండు ప్రముఖ హాలీవుడ్ సిరీస్‌లు త్వరలో నెట్‌ఫ్లిక్స్ నుంచి అదృశ్యం కానున్నాయి. చారిత్రక నేపథ్యంతో రూపొందిన ఎపిక్ డ్రామా ‘స్పార్టాకస్’ (Spartacus), కంట్రీ మ్యూజిక్ నేపథ్యంలో సాగిన పాపులర్ మ్యూజికల్ డ్రామా ‘నాష్విల్లే’ (Nashville) లను నెట్‌ఫ్లిక్స్ అమెరికా లైబ్రరీ నుంచి తొలగించనుంది. లైసెన్సింగ్ ఒప్పందం గడువు ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ రెండు సిరీస్‌లను 2026 సెప్టెంబర్ 14 వరకు మాత్రమే వీక్షించే అవకాశం ఉంటుంది. ఆ తేదీ తర్వాత అమెరికా నెట్‌ఫ్లిక్స్ లైబ్రరీలో ఈ షోలు అందుబాటులో ఉండవు.ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చినప్పటి నుంచి ఈ రెండు సిరీస్‌లు మంచి వ్యూయర్షిప్ను నమోదు చేశాయి. అయితే కంటెంట్‌కు సంబంధించిన లైసెన్సింగ్ ఒప్పందం కేవలం 12 నెలలకే పరిమితం కావడంతో, భారీ ఆదరణ ఉన్నప్పటికీ వాటి స్ట్రీమింగ్ హక్కులు ముగియనున్నాయి.
రోమన్ సామ్రాజ్య కాలం నేపథ్యంలో తెరకెక్కిన ‘స్పార్టాకస్’ యాక్షన్, డ్రామా, రాజకీయ కుట్రలు, ప్రతీకారం వంటి అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సిరీస్‌లో ‘బ్లడ్ అండ్ సాండ్(Blood and Sand)’, ‘గాడ్ ఆఫ్ ది ఏరీనా (Gods of the Arena)’, ‘వెన్జీన్స్(Vengeance)’, ‘వార్ ఆఫ్ ది డ్యామ్డ్(War of the Damned)’ అనే నాలుగు భాగాలు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నాలుగు సీజన్లు కలిపి సుమారు 259.4 మిలియన్ వ్యూయింగ్ గంటలు, దాదాపు 28.4 మిలియన్ వ్యూస్ నమోదు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇంతటి ఆదరణ పొందినప్పటికీ సెప్టెంబర్ 14 తర్వాత ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో కనిపించదు.ఇక ‘నాష్విల్లే’ విషయానికి వస్తే.. కంట్రీ మ్యూజిక్ ప్రపంచం, వ్యక్తిగత సంబంధాలు, కెరీర్ పోటీలు, భావోద్వేగాలతో సాగే ఈ సిరీస్ ఆరు సీజన్లలో ఏకంగా 124 ఎపిసోడ్లతో ప్రేక్షకులను అలరించింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్‌కు సుమారు 118.6 మిలియన్ వ్యూయింగ్ గంటలు, 8.1 మిలియన్ వ్యూస్ వచ్చినట్లు సమాచారం. అయినప్పటికీ లైసెన్స్ గడువు ముగియడంతో సెప్టెంబర్ 14 తర్వాత ఈ సిరీస్ కూడా స్ట్రీమింగ్ నుంచి తప్పుకోనుంది.
ఈ పరిణామం ఓటీటీ రంగంలో మారుతున్న కంటెంట్ లైసెన్సింగ్ విధానాలను కూడా సూచిస్తోంది. గతంలో ప్రముఖ స్టూడియోలు తమ సినిమాలు, సిరీస్‌లను నెట్‌ఫ్లిక్స్ వంటి ప్లాట్‌ఫామ్‌లకు కొన్ని సంవత్సరాల పాటు లైసెన్స్ ఇచ్చేవి. అయితే ఇప్పుడు తక్కువ కాలం పాటు కంటెంట్‌ను లైసెన్స్ చేసే విధానం పెరుగుతున్నట్లు పరిశ్రమలో చర్చ జరుగుతోంది. ఒక సంవత్సరం పాటు కంటెంట్‌ను స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌కు అందుబాటులో ఉంచిన తర్వాత దాన్ని తిరిగి సొంత స్ట్రీమింగ్ సేవల్లోకి తీసుకురావడం లేదా మరో ప్లాట్‌ఫామ్‌కు అధిక ధరకు లైసెన్స్ చేయడం ద్వారా స్టూడియోలు ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి.