– కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్
ఎర్రుపాలెం, ఆగస్ట్ 17 : పేద కుటుంబాల్లోని ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం యథావిధిగా కొనసాగించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రవేశపెట్టి అమలు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు వేలాది కుటుంబాలకు అండగా నిలిచాయన్నారు.
అయితే ఈ పథకాల అమలుకు సంబంధించి హైకోర్టులో దాఖలైన కేసు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లన మధ్యంతర ఉత్తర్వులు వెలువడటంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొందన్నారు. కావునా పేద కుటుంబాలకు అండగా నిలిచే సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వం తక్షణమే న్యాయపరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శీలం కవిత, మండల కార్యదర్శి యన్నం శ్రీనివాసరెడ్డి, మండల నాయకులు గూడూరు రమణారెడ్డి, శేగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, కుడుముల మల్లికార్జున రెడ్డి, బొర్ర నరసింహారావు, యరమల కృష్ణారెడ్డి, గద్దల శ్రీనివాసరావు, వేమిరెడ్డి బ్రహ్మానందరెడ్డి, కూరపాటి నాగేశ్వరరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.