Taapsee Pannu | బాలీవుడ్ నటి తాప్సీ పన్ను దక్షిణాది చిత్ర పరిశ్రమలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను బయటపెట్టి మరోసారి సినీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. తన తాజా చిత్రం ‘అస్సీ’ (ASSI) ప్రమోషన్ల సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కెరీర్ ఆరంభంలో గ్లామర్ పాత్రల కోసం మేకర్స్ తనను ఎంతగా ఇబ్బంది పెట్టేవారో వివరించింది. ముఖ్యంగా పాటల షూటింగ్ సమయాల్లో హీరోయిన్లు మరింత గ్లామర్‌గా, ఆకర్షణీయంగా కనిపించాలనే నెపంతో ప్యాడెడ్ బ్రాలు ధరించమని తనపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చేవారని ఆమె పేర్కొన్నారు. సెట్లో వందల మంది చూస్తుండగా, యూనిట్ సభ్యులందరి ముందూ ఇలాంటి వ్యక్తిగత మార్పుల గురించి బహిరంగంగా చర్చించడం ఒక మహిళగా తనకు ఎంతో అవమానకరంగా మరియు అసౌకర్యంగా అనిపించేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో కూడా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినిమాల్లో హీరోయిన్ల బొడ్డుపై పండ్లు, కొబ్బరికాయలు వేసే సంప్రదాయంపై తాప్సీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారాన్నే లేపాయి. ఇప్పుడు మరోసారి దక్షిణాది పరిశ్రమలో హీరోయిన్లను కేవలం ఒక గ్లామర్ బొమ్మలుగానే చూసే ధోరణి ఇంకా కొనసాగుతోందని ఆమె మండిపడ్డారు. ప్రస్తుతం తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ‘అస్సీ’ సినిమా ఫిబ్రవరి 20న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఒక సామూహిక అత్యాచార బాధితురాలి తరపున పోరాడే లాయర్ పాత్రలో ఆమె కనిపిస్తున్న ఈ చిత్రం, మహిళా హక్కులు మరియు సామాజిక న్యాయంపై చర్చను లేవనెత్తుతోంది. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో వచ్చిన ఈ పవర్ఫుల్ కోర్ట్ రూమ్ డ్రామా ఒకవైపు విజయవంతంగా నడుస్తుండగానే, తాప్సీ చేసిన ఈ వ్యక్తిగత వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.