Hindu Temples | ఝరాసంగం, ఏప్రిల్ 10 : హిందూ ధర్మ రక్షణకు దేవాలయాలు నిలయాలని, వాటి పరిరక్షణ మనందరిపై ఉంటుందని బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ1008 మహామండలేశ్వర్ మహంత్ సిద్ధేశ్వరానందగిరి మహారాజ్, ధనశ్రీ మఠాధిపతి వీరేశ్వర శివాచార్య పేర్కొన్నారు.
ఇవాళ సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని కక్కరవాడ గ్రామంలో నూతనంగా నిర్మించిన భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారి ప్రతిష్ఠాపన మహోత్సవాలకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉదయం గణపతి పూజ, గోపూజ, రుద్ర యజ్ఞం, పూర్ణాహుతి, స్వామివారికి జలాధివాసం, మహా మంగళహారతి నిర్వహించిన అనంతరం వేదమంత్రాలు, భక్తుల మధ్య యంత్ర విగ్రహ ప్రతిష్ఠాపన భక్తిశ్రద్ధలతో కొనసాగింది.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో ధార్మిక సభలో సిద్ధేశ్వరానందగిరి మహారాజ్, వీరేశ్వర శివాచార్య మాట్లాడుతూ.. దేవాలయాలు హిందూ ధర్మ రక్షణకు నిలయాలని, నూతనంగా ఆలయం నిర్మించినందుకు దేవాలయ ధర్మకర్తలను వారు అభినందించారు.
చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. తల్లి, తండ్రి, గురువులను భక్తిశ్రద్ధలతో పూజిస్తూ గౌరవించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమంతరావు పాటిల్, కేతకి ఆలయ చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.