Mahesh Babu | సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’పై దేశవ్యాప్తంగా కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫాంటసీ మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. ఈ చిత్రాన్ని శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కథను కె.వి. విజయేంద్ర ప్రసాద్, ఎస్.ఎస్. కాంచి అందిస్తుండగా, మాటలను దేవ కట్టా రచిస్తున్నారు. సంగీతాన్ని ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సమకూరుస్తున్నారు.
సినిమాలో మహేశ్ బాబు ద్విపాత్రాభినయం చేయనున్నారని సమాచారం. ‘రుద్ర’గా శక్తివంతమైన యోధుడిగా, అలాగే పౌరాణిక ఎపిసోడ్లో ‘రాముడు’గా దర్శనమివ్వనున్నారని టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా ‘మందాకినీ’ పాత్రలో నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాత్రల పరిచయంతోనే సినిమాపై అంచనాలు గరిష్ట స్థాయికి చేరాయి. హైదరాబాద్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసిన యూనిట్, తదుపరి షెడ్యూల్ కోసం జార్జియాకు వెళుతున్నారు . ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణంపై భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే అడ్వెంచర్ ఎపిసోడ్లను విదేశీ లొకేషన్లలో తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. అయితే జార్జియాకి వెళుతున్న మహేష్ బాబుకి భార్య నమ్రత, కూతురు సితార సెండాఫ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇదిలా ఉంటే గ్రాండ్ యాక్షన్ బ్లాక్స్, భారీ సెట్స్ ఈ షెడ్యూల్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. రామాయణానికి సంబంధించిన ఎపిసోడ్ చిత్రీకరణ ఇప్పటికే పూర్తయిందని రాజమౌళి వెల్లడించడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఇది పూర్తిస్థాయి సైన్స్ ఫిక్షన్ సినిమా కాదని, ఫాంటసీ మైథలాజికల్ జానర్‌కే చెందినదని రాజమౌళి తెలిపారు. పురాణాల నేపథ్యాన్ని ఆధునిక యాక్షన్ అడ్వెంచర్ శైలిలో మేళవిస్తూ భిన్న కాలప్రవాహాలను కలిపే కథగా ‘వారణాసి’ రూపుదిద్దుకుంటోందని చెప్పారు. 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా మూవీ విడుదల కానుంది.