– గురుకులం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సురేశ్ నాయక్
దామరచర్ల, ఫిబ్రవరి 24 : నిన్న జరిగిన తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం తీవ్ర నిరాశ కలిగించిందని గురుకులం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సురేశ్ నాయక్ అన్నారు. మంగళవారం దామరచర్ల మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తక్కువ వేతనాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుపై స్పష్టత లేకపోవడం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం పట్ల అనేక హామీలు ఇచ్చినప్పటికీ, ఈ సమావేశంలో ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు ప్రకటించకపోవడం బాధాకరం అన్నారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సేవలు లేకుండా అనేక శాఖలు సజావుగా పని చేయడం కష్టసాధ్యం అన్నారు. అందువల్ల ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని, వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, క్రమబద్ధీకరణ వంటి అంశాలపై స్పష్టమైన విధాన నిర్ణయాలు తీసుకోవాలని తాము కోరుతున్నట్లుత తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం గౌరవించి త్వరితగతిన సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వీర నాయక్, సునీత, స్వరాజ్యం, శంకర్ పాల్గొన్నారు.