హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో కీలకమైన ఎన్యుమరేషన్ ఫారాల (ఈఎఫ్‌ల) సమర్పణ గడువు సోమవారంతో ముగిసింది. కానీ, మరో కీలకమైన ఫారాల డిజిటలైజేషన్ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. రాష్ట్రంలోని మొత్తం 3,38,26,448 మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ 100 శాతం పూర్తయినా.. ఇప్పటివరకు 2,64,73,616 ఫారాలే డిజిటలైజేషన్ (78.26 శాతం) అయ్యాయి. మరో 73,52,832 ఫారాల డిజిటలైజేషన్ (21.74 శాతం) పెండింగ్‌లోనే ఉన్నది.
గడువు ముగిసిన వెంటనే ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణకు అధికారులు సిద్ధమవుతున్న వేళ.. ఇంత పెద్ద సంఖ్యలో ఫారాలు డిజిటలైజేషన్ కాకపోవడంపై అనేక ప్రశ్నలు, అనుమానాలు తలెత్తుతున్నాయి. సోమవారం సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) కార్యాలయం విడుదల చేసిన రిపోర్టు ప్రకారం.. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లోనూ ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ 100 శాతం పూర్తయింది. కానీ డిజిటలైజేషన్లో మాత్రం జిల్లాల మధ్య గణనీయమైన తేడాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర సగటు 78.26 శాతం కాగా.. కొన్ని జిల్లాలు 90 శాతానికిపైగా డిజిటలైజేషన్ పూర్తి చేశాయి.
సర్‌లో అత్యంత కీలకమైన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మలాజిగిరి జిల్లాల డిజిటలైజేషన్ గణాంకాలు రాష్ట్ర సగటు కంటే చాలా తకువగా ఉన్నాయి. హైదరాబాద్ 58.89%, మేడ్చల్ మలాజిగిరి 63.97%, రంగారెడ్డి 65.16% డిజిటలైజేషన్ పూర్తి అయ్యింది. ఈ మూడు జిల్లాల్లో కలిపి భారీ సంఖ్యలో ఓటర్లు ఉండటంతో ఇకడ మిగిలిన ఫారాల డిజిటలైజేషన్ పూర్తి చేయడం అధికార యంత్రాంగానికి కీలక సవాల్‌గా మారింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో మొత్తం 47,36,669 మందికి ఫారాలు పంపిణీ కాగా.. 27,89,214 మాత్రమే డిజిటలైజేషన్ అయ్యాయి. అంటే దాదాపు 19.47 లక్షల ఫారాల డిజిటలైజేషన్ ఇంకా పూర్తి కావాల్సి ఉన్నది. అలాగే మేడ్చల్-మలాజిగిరిలో మొత్తం 29,79,130 మంది ఓటర్లకు ఫారాలు పంపిణీ చేయగా.. 19,05,832 మాత్రమే డిజిటైజ్ అయ్యాయి.
రంగారెడ్డిలో 36,99,743 మంది ఓటర్లకుగాను 24,10,850 ఫారాలు డిజిటలైజేషన్ అయ్యాయి. గ్రామీణ జిల్లాల్లో డిజిటలైజేషన్ 90 శాతాన్ని దాటింది. మెదక్ 90.53 శాతం, సూర్యాపేట 90.45 శాతం, జనగామ 91.68 శాతం, యాదాద్రి భువనగిరి 94.31 శాతంతో ముందంజలో ఉన్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో 89.43 శాతం, జగిత్యాలలో 89.61 శాతం, పెద్దపల్లిలో 88.59 శాతం, నల్లగొండలో 89.52 శాతం డిజిటలైజేషన్ నమోదైంది. ఎన్యుమరేషన్ దశ ముగిసిన నేపథ్యంలో ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రచురించనున్నారు. అదే రోజు నుంచి సెప్టెంబర్ 16 వరకు ఓటర్ల నుంచి క్లెయిమ్‌లు, అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అనంతరం పరిశీలన, పరిషారం పూర్తిచేసి అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు.