హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): నేటి బాలలే రేపటి పౌరులు. మన పిల్లలు బాగుంటేనే మనం బాగుంటాం. మనం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుందనే విచక్షణతో నాటి కేసీఆర్ సర్కార్ చిన్నారుల చిట్టి గుండెలకు ఆరోగ్యభద్రత కల్పించాలని సంకల్పించింది. ఈ క్రమంలోనే నిమ్స్ దవాఖానలో 2022లో రూ.5 కోట్ల వ్యయంతో ప్రత్యేకంగా పీడియాట్రిక్ కార్డియో సర్జరీ విభాగాన్ని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఈ విభాగం ద్వారా ప్రతి నెలా 20 నుంచి 25 మంది చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలను చేయడమే కాకుండా యూకే వైద్య బృందంతో కలిసి నిమ్స్ వైద్యులు ఏటా మరో 20మంది చిన్నారులకు క్లిష్టమైన గుండె శస్త్ర చికిత్సలను పూర్తిగా ఉచితంగానే నిర్వహిస్తున్నారు. కేసీఆర్ నాటిన ఆ బీజం ఇప్పుడు మహావృక్షమై వందలాది మంది చిన్నారుల గుండెలకు ఆయువు పోసింది. ఈ క్రమంలో ఈ నెల 13 నుంచి నిమ్స్ దవాఖానలో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే చిన్నారులకు యూకే వైద్యుల సహాకారంతో ఉచితంగా శస్త్రచికిత్సలను నిర్వహించనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్ వెల్లడించారు.
గతంలో పిల్లల కోసం రాష్ట్రం మొత్తానికి ఒక నిలోఫర్ దవాఖాననే దిక్కవడం, అందులోనూ పిల్లలకు గుండె సమస్యలు వస్తే ఉస్మానియాకు రెఫర్ చేయడం జరిగేది. ఉస్మానియా, గాంధీ వంటి తాతల కాలంనాడు ప్రారంభించిన దవాఖానలు నిత్యం రద్దీతో ఉండడం వల్ల చిన్నారులకు సకాలంలో సరైన గుండె సంబంధిత వైద్యం అందకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యేవి. పీడియాట్రిక్ కార్డియో సర్జరీ విభాగం ప్రభుత్వ దవాఖానల్లో అందుబాటులో లేకపోవడంతో పలు రకాల హృద్రోగాలతో బాధపడే ఎంతో మంది చిన్నారులు ప్రైవేట్ దవాఖానలనే ఆశ్రయించాల్సి వచ్చేది.
ఈ క్రమంలో బాధిత తల్లిదండ్రులకు ఆర్ధిక భారంతో పాటు చిన్నారుల గుండె కోత తప్పేది కాదు. దీనిని గమనించిన నాటి కేసీఆర్ సర్కార్ చిన్నారుల కోసం నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)లో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఈ క్రమంలో రూ.5 కోట్ల వ్యయంతో పీడియాట్రిక్ కార్డియో సర్జరీ విభాగాన్ని ఏర్పాటు చేసింది. 2022, జూన్ 23న ఈ విభాగాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఎంతో మంది చిన్నారులకు పునర్జన్మ లభిస్తున్నది. దీంతో తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ర్టాలైన ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి కూడా రోగులు పెద్ద సంఖ్యలో నిమ్స్‌ను ఆశ్రయిస్తున్నారు.
నిమ్స్‌లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధునాత వైద్య సదుపాయాలకు తోడు నిమ్స్ వైద్య బృందం చొరవతో చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు చేయడానికి ఐదేండ్ల క్రితం యూకే వైద్య బృందం ముందుకు వచ్చింది. అప్పటి నుంచి నిమ్స్ కార్డియోథొరాసిక్ వైద్య బృందం, యుకే వైద్య బృందం సహాకారంతో ప్రతి సంవత్సరం దాదాపు 20మంది చిన్నారులకు క్లిష్టమైన గుండె శస్త్ర చికిత్సలను పూర్తిగా ఉచితంగానే నిర్వహిస్తోంది. ఇదికాకుండా ప్రతి నెలా 20నుంచి 25 గుండె శస్త్రచికిత్సలను చిన్నారులకు ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ వంటి పథకాల కింద పూర్తి ఉచితంగానే నిర్వహిస్తున్నట్లు కార్డియో థొరాసిక్ విభాగాధిపతి డాక్టర్ అమరేశ్వర్‌రావు తెలిపారు.
కేసీఆర్ హయాంలో ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ కార్డియో సర్జరీ విభాగంలో 6 పడకల సామర్ధ్యం గల ఐసీయూ వార్డు, రెండు వార్మర్ బెడ్స్‌తో పాటు అత్యాధునిక వైద్యపరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. కార్పొరేట్‌కు దీటుగా చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలు జరిపేందుకు ఈ యంత్రాలు ఎంతో ఉపయోగపడుతున్నాయంటున్నారు వైద్యనిపుణులు. ఈ యంత్రాల వల్ల నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెబుతున్నారు. ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన అధునాతన యంత్రాలతో శస్త్రచికిత్సల సమయంలో సర్జరీ ముగిసే వరకు చిన్నారి గుండెలకు కృత్రిమ సపోర్ట్ అందించడం జరుగుతుందని వైద్యులు వివరించారు. ఈ ఒక్క యంత్రమే రూ.కోటికి పైగా ఉంటుంది.
ఈ నెల 13 నుంచి నిమ్స్ దవాఖానలో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్సలను నిర్వహించనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్ వెల్లడించారు. నిమ్స్ కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగాధిపతి డా.అమరేశ్వర్ రావు నేతృత్వంలో లండన్‌కు చెందిన పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమణ తన్నపనేని, సాంకేతిక నిపుణుల బృందం సాయంతో ఈ శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు డైరెక్టర్ రాహుల్ వివరించారు.
గడిచిన ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నిమ్స్‌లో చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగానే ఈనెల 13నుంచి రోగి ఆరోగ్య పరిస్థితి ఆధారంగా ప్రాధాన్యత కేటాయించి వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వైద్య పరీక్షల అనంతరం చిన్నారులకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి పథకాల ద్వారా ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
అవసరం ఉన్న చిన్నారుల తల్లిదండ్రులు సోమవారం నుంచి శనివారం మధ్య కాలంలో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు నిమ్స్ పాత ఔట్‌పేషెంట్ బ్లాక్‌లోని మొదటి అంతస్తు సీటీ సర్జరీ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. గతంలో చేయించిన వైద్య పరీక్షల రిపోర్టులు, పాత వైద్య నివేదికలు అందుబాటులో ఉంటే వెంట తీసుకురావాలని, చికిత్స అవసరమున్న చిన్నారుల తల్లిదండ్రులు ముందస్తు అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా నిర్ణీత సమయాల్లో నిమ్స్‌కు నేరుగా వచ్చి సంప్రదించవచ్చని, ఇతర వివరాలకు 040-23489025 నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని డైరెక్టర్ డా.రాహుల్ దేవరాజ్ వెల్లడించారు.