Crops Cultivation | కోహీర్, మార్చి 22 : అధిక సాంద్రత పద్ధతిలో పత్తి పంటను సాగు చేసి అధిక దిగుబడులను సాధించాలని సంగుపేట్ ఏరువాక వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్త రాహుల్ విశ్వకర్మ పేర్కొన్నారు. ఇవాళ కోహీర్ మండలంలోని పలు గ్రామాల రైతులకు పంటల సాగుపై ఆయన అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా రాహుల్ విశ్వకర్మ మాట్లాడుతూ.. పత్తి పంటలో అధిక దిగుబడులను పొందేందుకు అధిక సాంద్రత పద్ధతిలో మొక్కలను నాటాలన్నారు. ఎకరానికి 25 వేల నుంచి 35 వేల మొక్కలను నాటితే 10 నుంచి 13 క్వింటాళ్ల పత్తి దిగుబడి లభిస్తుందన్నారు. ఈ పద్ధతి ద్వారా చేనులో ఉన్న పత్తి మొక్కలకు కాయ ఒకేసారి పగిలి అధిక దిగుబడి వస్తుందన్నారు.
పత్తిలో రసం పీల్చే పురుగులు, కాయ తొలుచు పురుగుల నివారణకు ఎకరానికి పసుపు రంగు జిగురు అట్టలను అమర్చాలని సూచించారు. విప్రోనిల్, ఎసిటమిఫ్రైడ్ రసాయనాన్ని పిచికారీ చేయాలని కోరారు. 40 రోజుల మధ్య మొపిక్వాట్ క్లోరైడ్‌ను మూడు సార్లు పిచికారీ చేయాలన్నారు. ముందుగా రైతులందరూ భూసార పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు. ఫామ్ ఆయిల్ తోటల సాగుకు సబ్సిడీ అందిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు వరప్రసాద్, రమేశ్, డాక్టర్ స్నేహలత, ఏడీఏ భిక్షపతి, ఏవో నవీన్‌కుమార్, ఏఈవోలు శ్రీనివాస్, ప్రవీణ్, ప్రశాంత్, మౌనికవర్మ, సంధ్య, సవిత, స్వాతిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ రవికిరణ్, రియాజ్, వీరారెడ్డి, ఈశ్వరప్ప, రాచన్న, శ్రీపాల్, గోపాల్, శ్రీకాంత్, రాము, తదితరులు పాల్గొన్నారు.
Hyderabad | ఎస్టీ హాస్టల్లో పురుగుల అన్నం.. రోడ్డెక్కిన విద్యార్థులు