Singuru Project | మునిపల్లి, నవంబర్ 11 : ప్రభుత్వ భూములను కబ్జాలు చేస్తే చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే గ్రామాల్లోని ప్రభుత్వ భూములను కాపాడేదెవరని మండలంలోని మల్లారెడ్డిపేట గ్రామస్తులు అధికారులు తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. మండల పరిధిలోని మల్లారెడ్దిపేట గ్రామ శివారులో గల సింగూర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ సమీపంలో ఓ బడా వ్యాపారవేత్త కొనుగోలు చేసిన (పట్టా) వ్యవసాయ పొలంలోకి సింగూర్ బ్యాక్ వాటర్ రాకుండా ఉండేందుకు సింగర్ బ్యాక్ వాటర్ సమీపంలో కాలువ తీసి నీళ్లు రాకుండా తీయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ శివారులో ఓ వ్యాపారవేత్త కొనుగోలు చేసిన వ్యవసాయ భూమి చుట్టూ రోడ్డు వేసుకునే క్రమంలో సింగూర్ ప్రాజెక్టు ఎఫ్టీఎల్ భూముల్లో తవ్వకాలు చేస్తున్నట్లు ప్రభుత్వ భూములను కాపాడాలంటూ మల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ శివజ్యోతి, మాజీ ఉపసర్పంచ్ రాజు గ్రామస్తులతో కలిసి సోమవారం(నిన్న)మునిపల్లి రెవెన్యూ అధికారులకు దరఖాస్తు ఇచ్చారు. అధికారులు నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరించడంతో మంగళవారం సింగూర్ బ్యాక్ వాటర్ సమీపంలో ప్రభుత్వ భూములు అక్రమ తవ్వకాలు జరపడంతో గ్రామస్తులు మరోసారి అధికారుల దృష్టికి తీసుకురావడంతో ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు నామమాత్రంగా స్పందించారు.
ఇలా పట్టుకొని అలా వదిలేయడం..
సింగూర్ బ్యాక్ వాటర్ సమీపంలో తవ్వకాలు జరుగుతున్న జేసీబీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తామని చెప్పి జేసీబీని సింగూర్ బ్యాక్ వాటర్ సమీపం నుంచి మల్లారెడ్డిపేట గ్రామ శివారులోకి తీసుకువచ్చి చేతులు దులుపుకున్నారు. ఇలా పట్టుకొని అలా వదిలేయడంపై విమర్శలు ప్రభుత్వ భూమిలో అక్రమంగా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్న ఓ జేసీబీని మంగళవారం మునిపల్లి రెవెన్యూ అధికారులు సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తూ మార్గం మధ్యలోనే చేతులు దులుపుకున్నారు.
మునిపల్లి మండలంలోని మల్లారెడ్డిపేటలో సింగర్ ప్రాజెక్ట్ సమీపంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్న వారికి అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్న ఓ బడా నాయకుడు రెవెన్యూ అధికారులకు ఫోన్ చేసి బెదిరించడంతో రెవెన్యూ అధికారులు జేసీబీని పోలీస్ స్టేషన్కు తరలించకుండా రోడ్డు మధ్యలోనే జేసీబీని వదిలి అక్కడ నుంచి వెళ్లిపోయారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు విమర్శలు చేస్తున్నారు.
మా జేసీబీని సీజ్ చేస్తారా..?
కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర నాయకుడు పీఏ అంటూ ఓ వ్యక్తి సంఘటన స్థలానికి చేరుకొని మా జేసీబీని సీజ్ చేస్తారా అంటూ రెవెన్యూ అధికారులపై దురుసుగా ప్రవర్తిస్తూ జేసీబీ తాళం తీసుకొని సంఘటన స్థలం నుంచి వెళ్లిపోయాడు. అనంతరం గ్రమానికి చెందిన ఓ వ్యక్తి రెవెన్యూ అధికారులను పిలిపించి జేసీబీని తీసుకెళ్లి మల్లారెడ్దిపేట పంచాయతీ కార్యాలయం వద్ద ఉంచారు. వాహనం సీజ్ చేస్తే పోలీస్ స్టేషన్కు తరలించాలి… గానీ పంచాయతీ కార్యాలయం వద్ద ఉంచడం ఏంటని గ్రామస్తులు అధికారుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి మల్లారెడ్డిపేట గ్రామ శివారులోని సింగూర్ ప్రాజెక్టులో అక్రమ తవ్వకాలు జరిపే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Dharmasagar | యూనియన్ బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి : బ్యాంక్ మేనేజర్ అనిల్
Madhira : లడకబజార్లో ఉచిత వైద్య శిబిరం