Sanitation | ఝరాసంగం, ఏప్రిల్ 13 : బీఆర్ఎస్ సర్కార్ హయాంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పల్లెప్రగతి, పట్టణ ప్రగతి పేరిట పనులు చేపట్టేవారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో సర్పంచులు లేరు.. నియమించిన ప్రత్యేకాధికారులు రారు.. ఫలితంగా పంచాయతీల పాలన అస్తవ్యస్తంగా మారిపోయింది. సర్పంచుల పదవీ కాలం ముగిసిన తర్వాత పంచాయతీల పాలనావ్యవహారాలను చూసేందుకు ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది.
మండల, డివిజన్ స్థాయిలోని గెజిటెడ్ ఉద్యోగులకు మూడు కంటే ఎక్కువ పంచాయతీల బాధ్యతలు అప్పగించింది. వారికి ఇప్పటికే పని భారం అధికంగా ఉండడంతో పంచాయతీల బాధ్యతలను చూడడంలో ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు. సొంత శాఖ విధులతోపాటు ఉన్నతాధికారుల సమీక్షలు, సమావేశాలు, ప్రభుత్వ పథకాల ప్రారంభ కార్యక్రమాలకు హాజరుకావడం వంటి బాధ్యతలు ఉండడంతో ప్రత్యేకాధికారులు ఏనాడూ గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్న దాఖలాలు లేవు.
పందులు స్వైరవిహారం..
ఝరాసంగం, కుప్పానగర్ పంచాయతీలలో సేకరించిన చెత్త డంపింగ్ యార్డులో వేయకుండా ఊరిబయట రోడ్డు పక్కల, అడవిలో డంపు చేయడంతో మూగజీవులు అందులో ఉన్న ప్లాస్టిక్ కవర్లను తింటున్నాయి. దీంతోపాటు ఝరాసంగం మండల కేంద్రంలో ఓ ఇంటి పక్కల కొన్ని నెలల తరబడి మురుగు నీరు నిల్వ ఉండడంతో చిన్న కుంటను తలపిస్తుంది.
కాలువల్లో మురుగు పేరుకుపోవడం, కొన్నిచోట్ల మురుగు కాలువలు లేక మురుగు నీంతా రోడ్లపై, వీధుల్లో ప్రవహిస్తుంది. అందులో పందులు స్వైరవిహారం చేయడం ఓ వైపు దుర్గంధం వెదజల్లుతుండటం మరోవైపు దోమలు విజృంభిస్తుడటం బ్లీచింగ్, ఫాగింగ్ వంటివి కనీసంగా కూడా కానరాకపోవడం వంటి కారణాలతో పల్లెలో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు.
సర్పంచుల ఎలక్షన్ నిర్వహించడంలో ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తుందని, ఉన్న ప్రత్యేకాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుడడంతో పంచాయతీలో నిధులు లేక పంచాయతీ కార్యదర్శులు చేతులెత్తేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.ఇప్పటికైనా ఉన్న సమస్యలను పరిష్కరించేలా ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై డీఎల్సీఓ అమృతను వివరణ కోరగా… ఉన్న సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని సమాధానం ఇచ్చారు.
Rollavagu project | రోళ్లవాగు ప్రాజెక్ట్ కు గేట్లు బిగించక వృథాగా పోతున్న నీరు
IPL 2025 | సెంచరీ హీరో అభిషేక్ శర్మకు వెల్లువెత్తిన అభినందనలు.. గురువు యువరాజ్ ఏమన్నాడంటే..?
Pawan Kalyan | హైదరాబాద్కి వచ్చాక తొలిసారి కొడుకు ఆరోగ్యంపై స్పందించిన పవన్ కళ్యాణ్