Janhvi Kapoor | బాలీవుడ్ నటి, తాజా సెన్సేషన్ జాన్వీ కపూర్ తన పుట్టినరోజు సందర్భంగా కలియుగ దైవం శ్రీవారిని దర్శించుకుని తనకున్న అపారమైన భక్తిని మరోసారి చాటుకుంది. మార్చి 6 తన 29వ పుట్టినరోజును పురస్కరించుకుని తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ద్వారా జాన్వీ తన ఆనవాయితీని కొనసాగించింది.తన పిన్ని నటి మహేశ్వరితో మెట్లమార్గంలో కొండపైకి చేరుకున్న జాన్వీ తెల్లవారుజామున వి.ఐ.పి (VIP) బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకుంది. దర్శనం అనంతరం జాన్వీకి రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు అందజేయగా, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను అందించారు. సాంప్రదాయ పట్టు వస్త్రాల్లో మెరిసిపోతున్న జాన్వీని చూసేందుకు భక్తులు ఎగబడగా, ఆమె ఎంతో ఓపికతో వారితో సెల్ఫీలు దిగుతూ కన్పించారు. ప్రస్తుతం తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి సారించిన ఈ భామ, ఇప్పటికే ‘దేవర’ చిత్రంతో అదరగొట్టి, త్వరలో రామ్ చరణ్ సరసన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రాబోతున్న భారీ చిత్రం ‘పెద్ది’ (Peddi) ద్వారా ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 30, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.