నటీనటులు: శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్, వీర్ ఆర్యన్, బాలాదిత్య, సుదర్శన్, రచ్చ రవి తదితరులు.
సంగీతం: కాలభైరవ
దర్శకత్వం: హుస్సేన్ షా కిరణ్
నిర్మాతలు: సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి
విడుదల తేదీ: మార్చి 06
గత వారం ‘విష్ణు విన్యాసం’తో నవ్వులు పూయించిన టాలీవుడ్ నటుడు శ్రీవిష్ణు గ్యాప్ లేకుండా మరో కొత్త సినిమాతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మృత్యుంజయ్. రెబా మోనికా జాన్ కథానాయికగా నటించగా.. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది అనేది రివ్యూలో చూద్దాం.
కథ
జయ్ (శ్రీవిష్ణు) ఒక న్యూస్ రిపోర్టర్. క్రైమ్ బ్యూరోలో పనిచేయాలనేది తన కల, కానీ అవకాశం దొరకక ప్రస్తుతానికి అడ్వర్టైజ్మెంట్ విభాగంలో పనిచేస్తుంటాడు. ఎవరైనా మరణిస్తే, వారి ఇంటికి వెళ్లి ఆ వ్యక్తి గొప్పతనం గురించి రాసి, కుటుంబ సభ్యుల నుండి శ్రద్ధాంజలి ప్రకటనలు సేకరించడం అతడి వృత్తి. ఈ క్రమంలో అచ్యుత్ రావు (బాలాదిత్య) మరణం జయ్‌ను కదిలిస్తుంది. అచ్యుత్ కూతురు అంజలి తన తండ్రి మరణం వెనుక ఉన్న కారణాన్ని అడగడంతో, జయ్ ఆ బాధ్యతను భుజానికెత్తుకుంటాడు. వరుసగా జరుగుతున్న కొన్ని మరణాలు ప్రమాదాలు కావని, పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్న హత్యలని జయ్ గుర్తిస్తాడు. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఐపీఎస్ అధికారి సీత (రెబా మోనికా జాన్)తో కలిసి జయ్ ఆ హంతకుడిని ఎలా పట్టుకున్నాడు? ఆ కిల్లర్ అసలు లక్ష్యం ఏమిటి? అన్నదే మిగతా కథ.
విశ్లేషణ
దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ ఒక విభిన్నమైన పాయింట్‌తో ఈ సినిమాను రూపొందించారు. కేవలం హత్యలు, ఇన్వెస్టిగేషన్ మాత్రమే కాకుండా, హీరో-విలన్ మధ్య సాగే మైండ్ గేమ్ సినిమాకు ప్రధాన బలమై నిలిచింది. సినిమా ప్రారంభంలో పాత్రల పరిచయం, హీరో చేసే వింతైన ఉద్యోగం ఆసక్తికరంగా ఉంటాయి. అయితే కథ అసలు పాయింట్‌కి రావడానికి కొంత సమయం తీసుకుంటుంది. ద్వితియార్థంలో సినిమా వేగం పెరుగుతుంది. హీరో-విలన్ ఒకరికొకరు తెలియకుండానే ఎదురుపడే సన్నివేశాలు, ఒకరి ఎత్తులకు మరొకరు పైెత్తులు వేయడం ఉత్కంఠను కలిగిస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ వరకు సస్పెన్స్ మెయింటైన్ చేయడంలో దర్శకుడు సఫలమయ్యారు.
నటీనటులు
శ్రీవిష్ణు తన మార్కు కామెడీని పక్కన పెట్టి, చాలా సీరియస్ రోల్లో ఒదిగిపోయాడు. ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ పాత్రకు తగ్గట్లుగా ఉన్నాయి. రెబా మోనికా జాన్ కేవలం గ్లామర్ కోసమే కాకుండా, ఒక బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించింది. వీర్ ఆర్యన్ ప్రతినాయకుడిగా వీర్ ఆర్యన్ నటన ఆకట్టుకుంటుంది. కొన్ని సీన్స్‌లో తన నటనతో భయపెట్టారు. కాలభైరవ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థ్రిల్లర్ మూడ్‌ను బాగా ఎలివేట్ చేసింది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ సినిమాను గ్రిప్పింగ్‌గా మార్చింది.
ప్లస్ పాయింట్స్:
శ్రీవిష్ణు కొత్త తరహా నటన.
ఆసక్తికరమైన కథనం
ద్వితీయార్ధంలో వచ్చే ఉత్కంఠభరితమైన మలుపులు.
నేపథ్య సంగీతం.
మైనస్ పాయింట్స్:
మొదటి సగంలో అక్కడక్కడా నెమ్మదించిన కథనం.
కొన్ని చోట్ల ఎమోషన్స్ ఇంకాస్త బలంగా ఉంటే బాగుండేది.
తుది తీర్పు
‘మృత్యుంజయ్’ ఒక క్లీన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. కమర్షియల్ హంగుల కంటే కథపైనే దర్శకుడు ఎక్కువ దృష్టి పెట్టారు. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ వీకెండ్లో ఇది ఒక మంచి ఛాయిస్.