గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పెద్ది’ (Peddi). ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈరోజు తన 29వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఆమెకు బర్త్డే విషెస్ తెలుపుతూ ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసింది.
కాటుక అక్కర్లేని ఆ కళ్లు, ముక్కుపుడక అక్కర్లేని ఆ ముక్కు.. అంటే అలంకరణ అక్కర్లేని అరుదైన చికిరియే ఈ చికిరి.. అంటూ దర్శకుడు బుచ్చిబాబు సనా జాన్వీని ప్రశంసిస్తూ ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సినిమాలో జాన్వీ ‘అచ్చియమ్మ’ అనే పల్లెటూరి యువతి పాత్రలో నటిస్తుంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ సహకారంతో వృద్ధి సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.