న్యూయార్క్: ఇరాన్‌ను ఆక్రమించాలన్న ఉద్దేశం తమకు లేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) పేర్కొన్నారు. సమయం వృధా తప్ప, దాంట్లో ఏమీ లేదన్నారు. అమెరికా బలగాలను ఇరాన్‌కు పంపే ఆలోచన లేదన్నారు. ఎన్బీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యలో ట్రంప్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అమెరికా-ఇజ్రాయెల్ దళాలు.. గత శనివారం నుంచి ఇరాన్‌పై దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ వార్‌లో ఇప్పటికే వేల మంది చనిపోయారు. క్షిపణులు, డ్రోన్లతో ఇరు దళాలు విరుచుకుపడుతున్నాయి. అయితే భూతల యుద్ధం చేపట్టేందుకు బలగాలను ఇరాన్‌కు పంపాలన్న ఆలోచన తమకు లేదని ట్రంప్ అన్నారు. అలా చేస్తే సమయం వృధా చేయడమే అవుతుందని, ఇరాన్ అన్నీ కోల్పోయిందని, ఆ దేశం నేవీ కూడా పూర్తిగా దెబ్బతిన్నదని, ఆ దేశం అన్నీ కోల్పోయిందని ట్రంప్ అన్నారు.
అమెరికా సైనిక దాడులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగాచీ పేర్కొన్న నేపథ్యంలో ట్రంప్ ఈ కౌంటర్ ఇచ్చారు. ఇరాన్లో ఉన్న నాయకత్వ వ్యవస్థను మార్చడమే తన లక్ష్యమని ట్రంప్ చెప్పారు. ఆ దేశానికి ఓ మంచి నేత కావాలని, మంచి పాలన చేసే వ్యక్తులు తనకు తెలుసు అని అన్నారు. అయితే ట్రంప్ తన వ్యాఖ్యల్లో ఎవరి పేరును ప్రస్తావించలేదు.