దేవరకొండ రూరల్, ఆగస్టు 01 : త్రాగునీటి కోసం రోడ్ ఎక్కిన మహిళలు జాతీయ రహదారిని దిగ్బంధం చేసి ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. దేవరకొండ రూరల్ మండలంలోని కొండ భీమనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారి 167 ప్రక్కన గల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయంలో తీవ్ర నీటి ఎద్దడిని నిరసిస్తూ శనివారం స్థానిక మహిళలు, కాలనీవాసులు ఖాళీ బిందెలతో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సమస్యలు పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రహదారిపై ట్రాఫిక్ ను స్తంభింప చేశారు. అనంతరం మహిళలు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కాలనీలో తీవ్రమైన తాగునీటి సమస్య ఉన్నప్పటికీ అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో తాము రోడ్డు ఎక్కాల్సి వచ్చిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ త్రాగునీళ్లు రాక చాలా రోజులవుతుందని, రోజువారి అవసరాలకు కూడా నీళ్లు అందకపోవడంతో పిల్లలు, పెద్దలు అంతా నరకం చూస్తున్నామని మండిపడ్డారు.
ధర్నా కారణంగా జాతీయ రహదారిపై రెండు గంటలకు పైగా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. తాగునీటి సమస్య కాకుండా డ్రైనేజీ వ్యవస్థ కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ రాయదుర్గారెడ్డి, సీఐ వెంకట్ రెడ్డి తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిరసనకారులతో మాట్లాడి తాగునీటి ఇబ్బందులు మిగతా సమస్యలను పై అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో కాలనీవాసులు ధర్నా విరమించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరించడంతో వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.