Puvvada Ajay Kumar : గోదావరి వరద నివారణలో ప్రభుత్వాల ఉదాసీన వైఖరిని ప్రజలు గమనించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) పిలుపునిచ్చారు. గోదావరి అంశంపై అనేకసార్లు పోరాటం చేశానన్న పువ్వాడ.. భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం కనిపిస్తున్న గోదావరి వరద ఉద్ధృతికి కారణాలను వెల్లడించారు. సహజ పరిస్థితుల వల్ల మాత్రమే ఈ పరిస్థితి ఏర్పడలేదని, దిగువన ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావం కూడా ప్రధాన కారణమనే విషయాన్ని ప్రజలు గమనించాలని ఆయన పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా భద్రాచలం, దాని పరిసర గ్రామాల్లో ముంపు సమస్య మరింత తీవ్రరూపం దాల్చిందని పువ్వాడ అజయ్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. వరదలు వచ్చిన ప్రతిసారి స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు పార్టీ తరఫున పోలవరం ముంపు సమస్యపై తొలి నుంచి నిరంతరం పోరాటం చేశానని పువ్వాడ తెలిపారు. గతంలో అనేక వేదికలపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి, తెలంగాణ ప్రజల పక్షాన బలంగా గళం వినిపించానని మాజీ మంత్రి గుర్తు చేశారు. భద్రాచలం ప్రాంత ప్రజల ప్రయోజనాల పరిరక్షణలో బీఆర్ఎస్ ఎప్పటికీ రాజీపడదని ఆయన స్పష్టం చేశారు.

ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం బాధ్యతలు నెట్టేసుకునే ధోరణిని విడనాడాలని పువ్వాడ కోరారు. పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంపై సమగ్ర అధ్యయనం నిర్వహించి, భద్రాచలం పరిసర ప్రాంతాలకు శాశ్వత ముంపు నివారణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వరదల సమయంలో తాత్కాలిక సహాయక చర్యలకే పరిమితం కాకుండా, భవిష్యత్తులో ముంపు సమస్య పునరావృతం కాకుండా శాశ్వత కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని పువ్వాడ అజయ్ కుమార్ కోరారు.