న్యూఢిల్లీ: చీఫ్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేశ్ కుమార్ తన విధులను నిర్వర్తించకుండా అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు(Supreme court)లో పిల్ దాఖలైంది. అయితే ఆ పిల్‌పై వచ్చే వారం విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ ఆ పిల్‌పై వాదనలు విననున్నది. రాకేశ్ కుమార్ సింగ్ ఆ పిల్‌ను దాఖలు చేశారు. అయితే అర్జెంట్‌గా వాదనలు వినాలని కోరుతూ సీనియర్ న్యాయవాది వికాశ్ సింగ్ కోరారు. ఎన్నికల కమిషన్‌లో ఒకవేళ నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకుంటే, అప్పుడు సమస్య తీవ్రమైంది అవుతుందని సింగ్ కోర్టుకు తెలిపారు. సుప్రీం ధర్మాసనంలో జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వీ మోహన కూడా ఉన్నారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ నిర్వహణ తీరుపై అనుమానాలు ఉన్నాయని, ఇద్దరు ఎన్నికల కమీషనర్ల అభిప్రాయాలను సీఈసీ పట్టించుకోలేదని సింగ్ తెలిపారు. అక్టోబర్ 2025 నుంచి ఆగస్టు 2026 వరకు 14 అంశాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా, సీఈసీ మాత్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కమీషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషిలు .. సర్ ప్రక్రియను వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో సీఈసీ ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలను అడ్డుకోవాలని, ఆయన్ను సస్పెండ్ చేయాలని పిల్లో డిమాండ్ చేశారు.