Nandini Sri Girimatha | ఝరాసంగం, జూలై 20 : ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా నిలిచిన బర్దిపూర్ గ్రామంలోని శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం, ఆధ్యాత్మిక చైతన్యం, మానవతా సేవల కోసం పేరుగాంచింది. ఆశ్రమంలో గురుసేవకులుగా జీవితాన్ని అంకితమిచ్చినవారిలో నందిని శ్రీగిరి మాత ఒకరు. మానవసేవే పరమోధర్మం అనే ఆదర్శంతో జీవించడమే నిజమైన సన్యాసమని నిరూపిస్తూ.. యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఆమె జీవితంపై ప్రత్యేక కథనం..
సంగారెడ్డి పట్టణానికి చెందిన కొమ్మ రాజమణి, రాములు దంపతులకు చెందిన రెండవ సంతానం కొమ్మ పుణ్యవతి విద్యాభ్యాసం, ఉద్యోగ జీవితంలోనూ అత్యుత్తమ స్థాయిలో నిలిచారు. ఆధ్యాత్మికత పట్ల ఉన్నఅసమానమైన ఆకర్షణతో గత 20 సంవత్సరాలుగా ఆశ్రమంలో సేవలందిస్తూ జీవితాన్ని ముందుకు సాగిస్తున్నారు.
విద్య, ఉద్యోగ జీవితం నుంచి సన్యాసం దిశగా..
1996–2000 మధ్య విజయవాడలో డిప్లొమా, అనంతరం 2000–2004లో జేఎన్టీయూ నుంచి ఈసీఈ విభాగంలో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీడీఎల్‌లో కొన్నాళ్లపాటు ఉన్నత ఉద్యోగం చేపట్టారు. ఆ తర్వాత ఆధ్యాత్మిక మార్గమే లక్ష్యంగా పెట్టుకొని నందిని శ్రీగిరి మాత 2006లో బీడీఏల్లో ఉద్యోగాన్ని రాజీనామా చేసి శ్రీ దత్తగిరి ఆశ్రమానికి వచ్చారు. అక్కడి నుంచి గురుసేవను జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారు.
శ్రద్ధ, సేవతో గురు దీక్ష
ఆధ్యాత్మిక సేవల పట్ల వారి శ్రద్ధను గుర్తించిన ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ అవధూత గిరి మహరాజ్, శ్రీ సిద్దేశ్వరానందగిరి మహారాజ్ ఆశీస్సులతో 2018 శ్రావణ మాసంలో నందిని శ్రీ గిరి మాతగా పూర్తి స్థాయి కాషాయ వస్త్రాలు, రుద్రాక్ష మాలలు ధరించి సన్యాస దీక్ష తీసుకున్నారు.
ఆశ్రమంలో నిర్వహించే వైదిక విద్యా ప్రాచుర్యం, ఉచిత వైద్య శిబిరాలు, ప్రవచనాలు, భజన కీర్తనలు, ఆధ్యాత్మికం వైపు మళ్లించేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. గురు పౌర్ణమి, దత్త జయంతి, పాదయాత్ర పల్లకి సేవ, ప్రతీ నెలా 1, లక్ష జప యజ్ఞం, విశ్వ మానవ ధర్మ ప్రచారం సభలు,నూతన ఆలయాల నిర్మాణం, భక్తులకు ఆధ్యాత్మిక చింతన వంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ తనదైన ముద్ర వేస్తున్నారు.
గురువుల అడుగుజాడల్లో నడవడమే నా ధ్యేయం : నందిని శ్రీగిరి మాత
దత్తగిరి ఆశ్రమం నాకు దైవ ఆశీర్వాదంగా లభించింది. ఏడవ తరగతి నుంచే ఆశ్రమంతో నా అనుబంధం మొదలైంది. చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మికత పట్ల ఆకర్షణ ఉండడం వల్లనే సంసార జీవితంలోకి వెళ్లలేదు. గురువుల ఆశీర్వాదంతో ఆశ్రమ బాధ్యతలన్నీ నిర్వహిస్తూ, ఆశ్రమాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నాను. అవధూత గిరి మహరాజ్, సిద్దేశ్వరానందగిరి మహారాజ్ ల ఆశయాలను నెరవేర్చడమే నా ధ్యేయం అన్నారు.
Yellareddypet | పల్లెను మరిచిన ప్రభుత్వం.. గ్రామాల్లో పడకేసిన పారిశుధ్యం..
Siddaramaiah | డీకే శివకుమార్ పేరెత్తిన కార్యకర్త.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం సిద్ధరామయ్య
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి