Siddaramaiah : కర్ణాటక (Karnataka) లో సీఎం మార్పు ఉంటుందని, సిద్ధరామయ్య (Siddaramaiah) ను పదవి నుంచి తప్పించి డీకే శివకుమార్ (DK Shivakumar) ను సీఎం చేస్తారని గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే డీకే శివకుమార్, సిద్ధరామయ్య సహా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు కూడా ఆ ప్రచారాన్ని తోసిపుచ్చుతూ వస్తున్నారు. ఈ క్రమంలో శనివారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది.
మైసూరులో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య ప్రసంగిస్తుండగా.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేరు ప్రస్తావించాలని ఓ కార్యకర్త డిమాండ్ చేశాడు. దాంతో సిద్ధరామయ్య ఆగ్రహానికి లోనయ్యాడు. ఇంట్లో కూర్చునే వాళ్ల గురించి ఇక్కడ ఎందుకని అసహనం వ్యక్తం చేశారు. ఆ కార్యక్రమానికి డీకే శివకుమార్, సిద్ధరామయ్య, కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు.
డీకే తన ప్రసంగం తర్వాత ముఖ్యమైన పనిమీద బెంగళూరుకు బయలుదేరారు. ఆ తర్వాత సీఎం సిద్ధరామయ్య ప్రసంగం మొదలైంది. సభకు విచ్చేసిన ప్రముఖుల పేర్లను ప్రస్తావించిన ఆయన డిప్యూటీ సీఎం పేరును ప్రస్తావించ లేదు. దాంతో పార్టీ కార్యకర్త ఒకరు డీకే పేరును గుర్తుచేశాడు. దాంతో సీఎం ఆయనపై మండిపడ్డారు.
‘శివకుమార్ ఇక్కడ లేరు కదా? దయచేసి వెళ్లి కూర్చొండి. ఆయన బెంగళూరుకు తిరిగి వెళ్లిపోయారు. వెళ్లిపోయిన వారి గురించి కాదు.. వేదికపై ఉన్న నేతల పేర్లను ప్రస్తావించాలి. ఇంట్లో కూర్చున్న వారి గురించి కాదు. ఇక్కడ ఉన్నవారికి ఆహ్వానం పలకాలి. అదే ప్రొటోకాల్. ఆ మాత్రం అర్థం చేసుకోలేరా’ అని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సీఎం వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.