Crime news : మహిళా ఏఎస్ఐ (Woman ASI) తో సహజీవనం చేస్తున్న ఓ సీఆర్పీఎఫ్ జవాన్ (CRPF Jawan) ఆమెను గొంతునులిమి చంపేశాడు. ఆ తర్వాత ఆమె పనిచేస్తున్న పోలీస్‌స్టేషన్‌కే వెళ్లి లొంగిపోయాడు. గుజరాత్ (Gujarat) రాష్ట్రంలోని కచ్ జిల్లా (Kutch district) లో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. కచ్ జిల్లా అంజార్‌కు చెందిన మహిళా ఏఎస్ఐ అరుణాబెన్ నాటుబాయ్ జాదవ్ (25), సీఆర్పీఎఫ్ జవాన్ దిలీప్ దంగ్చియా 2021 నుంచి సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ సందర్భంగా దిలీప్ తల్లి గురించి అరుణాబెన్ అసభ్యంగా మాట్లాడటంతో అతడు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు.
అరుణాబెన్ గొంతునులిమి చంపేశాడు. ఆ తర్వాత ఆమె పనిచేస్తున్న అంజార్ పోలీస్‌స్టేషన్‌కే వెళ్లి లొంగిపోయాడు. దిలీప్ దంగ్చియా మణిపూర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అరుణాబెన్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. దిలీప్ పోలీసుల అదుపులో ఉన్నాడు.