Sleeping Prince : కారు ప్రమాదం (Car accident) లో తీవ్రంగా గాయపడి గడిచిన 20 ఏళ్లుగా కోమా (Coma) లో ఉన్న సౌదీ యువరాజు (Saudi prince) అల్ వలీద్ బిన్ ఖాలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ (Al Waleed bin Khaled bin Talal Al Saud) మృతిచెందారు. ఆయన వయసు ప్రస్తుతం 36 సంవత్సరాలు. శనివారం అల్ వలీద్ కన్నుమూశాడని ‘గ్లోబల్ ఇమామ్స్ కౌన్సిల్ (GIC)’ తెలిపింది. ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది.
సుదీర్ఘ కాలం కోమాలో ఉండటంవల్ల అల్ వలీద్ ‘స్లీపింగ్ ప్రిన్స్ (Sleeping Prince)’ గా వార్తల్లో నిలిచారు. దాదాపు ఇరవై ఏళ్లుగా కోమాలో ఉన్న ఆయన సుదీర్ఘ పోరాటం తర్వాత కన్నుమూశారని గ్లోబల్ ఇమామ్స్ కౌన్సిల్ పేర్కొంది. ఈ విషాదం నుంచి ఆ కుటుంబం త్వరగా కోలుకునే ధైర్యం భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపింది. అల్ వలీద్ తండ్రి ఖాలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ కూడా ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ధ్రువీకరించారు.
సౌదీ యువరాజు అల్ వలీద్ 1990 ఏప్రిల్‌లో.. సౌదీ రాజు ఖాలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ దంపతులకు జన్మించారు. ఆయన బ్రిటన్‌లోని మిలిటరీ కాలేజీలో చదువుతుండగా.. 2005లో ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి కోమాలో ఉన్న యువరాజుకు రియాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ట్యూబ్ ద్వారా ఆహారం అందించేవారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నప్పటికీ కోలుకునే అవకాశం లేదని భావించి 2015లో దాన్ని తొలగించాలని వైద్యులు సిఫార్సు చేశారు. అయితే ఏదైనా అద్భుతం జరగవచ్చనే ఆశతో ఆయన తండ్రి అందుకు నిరాకరించారు.
అయితే 2019 లో వలీద్ ఓసారి కోలుకున్నట్లు కనిపించారు. చేతివేళ్లు కదిలించడం, తలను తిప్పడంతో యువరాజు తిరిగి కోలుకుంటారని అంతా భావించారు. కానీ ఆ తర్వాత ఆయన స్థితిలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఇటీవల ఆయన 36వ పుట్టినరోజు సందర్భంగా యువరాజు ఆరోగ్యం మెరుగుపడాలంటూ సోషల్ మీడియాలో మద్దతుదారులు పోస్టులు పెట్టారు. కానీ తాజాగా ఆయన మరణించారు.