Allu Sirish | టాలీవుడ్ యువ హీరో అల్లు శిరీష్ ఇటీవల పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మార్చి 6న హైదరాబాద్‌లో జరిగిన ఘనమైన వేడుకలో తన ప్రియురాలు నయనిక రెడ్డిని వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. పెళ్లి తర్వాత ఈ జంట తమ తమ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు శిరీష్ తన లవ్ స్టోరీ, పెళ్లి నిర్ణయం, హనీమూన్ ప్లాన్స్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
అల్లు శిరీష్ తెలిపిన వివరాల ప్రకారం, నయనికను మొదటిసారి ఒక పార్టీలో కలిశానని చెప్పారు. ఆ పార్టీని హీరో నితిన్, ఆయన భార్య షాలిని కందుకూరి ఏర్పాటు చేశారు. అది హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాహం సందర్భంగా జరిగిన పార్టీ అని ఆయన వివరించారు. నయనిక, శాలినికి బెస్ట్ ఫ్రెండ్ కావడంతో అక్కడే మొదటిసారి ఇద్దరం కలుసుకున్నామని చెప్పారు. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారిందని శిరీష్ వెల్లడించారు. డేటింగ్ ప్రారంభించినప్పటి నుంచే ఇద్దరూ పెళ్లి గురించి మాట్లాడుకున్నామని అల్లు శిరీష్ తెలిపారు. భవిష్యత్తులో కుటుంబం ఏర్పాటు చేసుకోవాలని ఇద్దరికీ ఒకే అభిప్రాయం ఉందని చెప్పారు. తమకు పుట్టబోయే పిల్లలు ఇంట్లో తప్పకుండా తెలుగులో మాట్లాడాలని కూడా ఇద్దరూ నిర్ణయించుకున్నామని కూడా చెప్పారు.
నయనికలో తనకు అత్యంత నచ్చిన విషయం ఆమె సెన్స్ ఆఫ్ హ్యూమర్ అని శిరీష్ చెప్పారు. ఆమె చాలా సూటిగా మాట్లాడుతుందని, ఏ విషయమైనా నేరుగా చెప్పేస్తుందని అన్నారు. ఏదైనా నచ్చకపోతే అదే విషయాన్ని స్పష్టంగా చెబుతుందని తెలిపారు. తన జీవితంలోని అన్ని విషయాలను ఆమెతో పంచుకుంటానని, తన సినిమాల గురించి కూడా నయనిక నిజాయితీగా అభిప్రాయం చెబుతుందని శిరీష్ వెల్లడించారు. ఒకసారి నయనికతో కలిసి కాఫీ షాప్‌కు వెళ్లిన విషయం బయటకు తెలిసి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం వెళ్లిందని శిరీష్ చెప్పారు. స్నేహా రెడ్డి, నయనిక సోదరి నిహారిక మంచి స్నేహితులు కావడంతో వారి ప్రేమ గురించి కుటుంబంలో అందరికీ తెలిసిపోయిందని చెప్పారు. హనీమూన్ గురించి కూడా అల్లు శిరీష్ మాట్లాడారు. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారని చెప్పారు. కొత్త అపార్ట్‌మెంట్‌ను రెడీ చేసుకుంటున్నామని, నయనిక కూడా తిరిగి తన పనితో బిజీ అయిందని చెప్పారు.