Carmeni Selvam Teaser | నేటి ఆధునిక కాలంలో డబ్బు, కుటుంబం మరియు మనుషుల ఆశయాల చుట్టూ తిరిగే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘కార్మేని సెల్వం’. పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా, రామ్ చక్రి దర్శకత్వంలో రూపొందిన ఈ ద్విభాషా చిత్రం (తెలుగు, తమిళం) ఏప్రిల్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సముధ్రఖని కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్ర పోషించగా, లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రముఖ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తుండగా, యువరాజ్ దక్షన్ ఛాయాగ్రహణం, MAAS (Music as a Service), Musicloud Studio & Technology సంగీతం అందించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న సందర్భంగా మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.
డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి అంటూ విలక్షణ నటుడు సముద్రఖని చెప్పే పవర్ఫుల్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ఈ టీజర్, నేటి సమాజంలో ఉన్న ఆర్థిక సవాళ్లను కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ కల్చర్, ఈఎంఐల భారం, క్రిప్టో పెట్టుబడులు మరియు త్వరగా ధనవంతులు కావాలనే ఆశతో చేసే ప్రయత్నాలు మధ్యతరగతి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఇందులో అర్థవంతంగా చూపించారు. సముద్రఖని తన కుటుంబంతో గడిపే హృద్యమైన సన్నివేశాలు ఒకవైపు, విదేశాల్లో ఒంటరిగా కనిపించే దృశ్యాలు మరోవైపు సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. టీజర్ చివర్లో “రిచ్ కావాలంటే రిచ్ మనిషిలా ఖర్చు చేయడం నేర్చుకోవాలి… డబ్బు లేకపోతే అప్పు తీసుకుని ఖర్చు చేయాలి” అని సముద్రఖని చెప్పే డైలాగ్ నేటి వినియోగదారి తత్వానికి అద్దం పడుతోంది. సామాజిక సందేశంతో పాటు కమర్షియల్ విలువలతో రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.