ఎల్లారెడ్డిపేట, జూలై 20: కాంగ్రెస్ ప్రభుత్వం పల్లె ప్రగతిని ఎప్పుడో మరిచిపోయిందని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వర్స కృష్ణహరి విమర్శించారు. ఆదివారం హరితహారంలో భాగంగా రాజన్నపేటలో మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. పల్లెల్లో పారిశుధ్య నిర్వహణ లేక ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతుందని, మురుగు కాల్వలు తీసే పరిస్థితి లేదని, ఇప్పటి వరకు గ్రామాల్లో రాష్ట్రప్రభుత్వ పనులు చేపట్టిన దాఖలాలు ఏమీ లేవని మండిపడ్డారు. అందమైన, స్వచ్ఛమైన గ్రామాలుగా ఉన్న పల్లెలను పట్టించుకునే పరిస్థితి గ్రామాల్లో లేదని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామాల్లో చెత్త సేకరణకు ట్రాక్టర్లు, డంపింగ్ యార్డులు, శ్మశానవాటికలు, పల్లె ప్రకృతి వనాలు, గ్రామపంచాయతీ భవనాలు నిర్మించి పెడితే వాటిని కనీసం నిర్వహించడం చేతగాని పరిస్థితిలో కాంగ్రేస్ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. చిత్తశుద్దితో పంచాయతీలకు నిధులు కేటాయించి పారిశుధ్య పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, నాయకులు అందె సుభాశ్, నమిలికొండ శ్రీనివాస్, ఎరుపుల స్వామి, మురళీమోహన్, శివారెడ్డి, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్, చంద్రారెడ్డి, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.