MLA Manikya Rao | జహీరాబాద్, ఏప్రిల్ 10 : బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్యరావు పిలుపునిచ్చారు. ఇవాళ జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే హామీలన్నీ అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఏడాదిన్నర గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు.
నాడు సమైక్య పాలకుల పాలనలు, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో నీరు, నిధులు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా 25 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిందన్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో స్వరాష్ట్రం కోసం అలు పెరుగని పోరాటాలు చేసిందన్నారు. మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మెతో కేంద్రాన్ని కదిలించిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్గా ఆవిర్భవిం చిందన్నారు.
ప్రతీ గడపకు సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో అనేక విప్లవాత్మ కమైన మార్పులు తీసుకువచ్చిందని, రైతులకు, బడుగు, బలహీనవర్గాలకు, దళితులకు ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. దేశంలోనే తెలంగాణను అగ్రగామి రాష్ట్రంగా నిలిపిన ఘనత కేసీఆర్దన్నారు.
వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరుగనున్న రజతోత్సవ సభలో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు భవిష్యత్ గురించి దిశా నిర్దేశం చేయనున్నారని, ప్రజలు హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు బీఆర్ఎస్ రజతోత్సవ సభ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, పార్టీ నాయకులు నామ రవి కిరణ్, గుండప్ప, విజయ్ కుమార్, యాకూబ్, ముజుద్దీన్ ,భాస్కర్, నర్సింలు గౌడ్ , పీఎసీఎస్ చైర్మన్ మచందర్ పాల్గొన్నారు.