నిజాంసాగర్, మారి 1: ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని గల్ఫ్‌కు వెళ్లిన వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. తమ బంధువులు, సన్నిహితులు, స్నేహితులు ఎలా ఉన్నారో అంటూ కలవరపాటుకు గురవుతున్నారు. వారి యోగక్షేమ సమాచారం గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఇరాన్‌పై శనివారం ఉదయం ఇజ్రాయిల్, ఆమెరికా సంయుక్తంగా దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున క్షిపణులను టెహ్రన్పై ప్రయోగించాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ సైతం దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాలపై వైమానిక దాడులు ప్రారంభించింది. అయితే ఇరాన్ క్షిపణులను మధ్యలోనే అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. మరోవైపు ఇరాన్ బహ్రెయిన్, కువైట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ సహా అనేక దేశాలపై ఆమెరికా, ఇజ్రాయెల్ ఆస్తు లు, సైనిక స్థావరాలపై క్షిపణులను ప్రయోగించింది. దీంతో మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఉమ్మడి జిల్లావాసుల్లో ఆందోళన
గల్ఫ్ దేశాల్లో ఉమ్మడి జిల్లా వాసులు వేల సంఖ్యలో నివసిస్తున్నారు. కొంత మంది ఉద్యోగ రీత్యా, మరికొందరు ఉన్నత చదువుల కోసం వెళ్లారు. ముఖ్యంగా వలస కార్మికులు పెద్ద సంఖ్య లో అక్కడ పనిచేస్తున్నారు. ప్రస్తుతం యుద్ధం నేపథ్యంలో ఇక్కడ వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఇరాన్ దాడులతో ఇప్పటికే ఆయా దేశాల్లోని ఎయిర్ స్పెస్లను మూసివేశారు. అక్కడ పరిస్థితులు భయానకంగా ఉన్నాయని తామంతా సేఫ్‌గా ఉన్నట్లు ఉమ్మడి జిల్లాకు చెందిన అక్కడ ఉన్నకొందరు తెలిపారు.
సురక్షితంగా ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్న..
మా మండలానికి చెందిన ఎంతో మంది ఉపాధి కోసం దుబాయ్‌తో పాటు ఇతర దేశాలకు వెళ్లారు. ఇక్కడ ఉంటున్న వారి కుటుంబీకుల కోసం వారు అక్కడ కష్టపడి పనిచేస్తున్నారు. వారం తా అక్కడ సురక్షితంగా ఉండాలి. ఎందుకంటే అక్కడ వారు సురక్షితంగా ఉంటేనే ఇక్కడ వారి కుటుంబీకులు సురక్షితంగా ఉంటా రు. మన వాళ్లు ఎక్కడ ఉన్నా సురక్షితంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా.
-చంద ప్రవీణ్‌కుమార్, నిజాంసాగర్
ఆందోళనకు గురవుతున్నాం..
మా బంధువులు ఆమెరికాలో ఉన్నారు. అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయనే వార్తలు రెండు రోజులుగా వింటుంటే ఆందోళనకు గురవుతున్నాం. ఇరాన్ దాడులకు దిగడంతో మా బంధువులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇండియాకు వస్తామంటే విమాన సర్వీసులు నిలిపివేశారు. అంతా దేవుడిపై భారం వేసి గడుపుతున్నారు. మన ప్రభుత్వం అక్కడి వారిని సురక్షితంగా తీసుకుచ్చేలా చర్యలు తీసుకోవాలి.
-మామిడి సంతోష్‌కుమార్, వ్యాపారి, నిజామాబాద్