Govt Colleges | జహీరాబాద్, జూన్ 10 : ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉందని న్యాల్కల్ మండలంలోని హద్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక కళాశాలకు చెందిన లెక్చరర్లతో కలిసి మండలంలోని రాజోలా, మెటల్‌కుంట, కల్బేమల్, మామిడ్గిలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాశాలలో విద్యార్థులు చేరేందుకు ఎలాంటి ప్రవేశ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. విద్యార్థులకు ప్రైవేటు కళాశాలలకు ధీటుగా తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నామన్నారు. కళాశాలలో చదివేందుకు ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయన్నారు. విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, స్టడీ మెటీరియల్, అర్హులందరికీ ఉపకారవేతనాలను ప్రభుత్వం అందజేస్తుందని పేర్కొన్నారు.
కళాశాలలో చదివే విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ ప్రతిభగల లెక్చరర్లతో విద్యను బోధించడం జరుగుతుందన్నారు. కళాశాలల్లో విద్యార్థుల కోసం పక్కాభవనాలు, ప్రయోగశాలలు, గ్రంధాలయం, క్రీడా మైదానం, ఎన్ఎస్ఎస్ వంటివి సౌకర్యాలున్నాయన్నారు. తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తమ పిల్లలను ప్రభుత్వ కళాశాలలోనే చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్లు అర్జున్, జగదీశ్, యాదగిరి, సిద్ధయ్యస్వామి, కవిరాజ్, బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.