శివ్వంపేట, మార్చి 14 : ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను శాసనసభలో ప్రస్తావించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) నాయకులు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. శివ్వంపేటలో ఎమ్మెల్యేతో తపస్ నాయకులు తమ గోడును వెలిబుచ్చారు. వెంటనే ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు, బకాయిలు, పీఆర్సీ అమలు, అలాగే పెండింగ్ డీఏల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించేలా శాసనసభలో ప్రస్తావించాలని సంఘం నాయకులు ఎమ్మెల్యేను కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు పలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తపస్ నాయకులు ఎమ్యేల్యే సునీత లక్ష్మారెడ్డికి వివరించారు. ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన వారిలో తపస్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి దుబాశి భాస్కర్, మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాల సిద్ధు, జిల్లా ఉపాధ్యక్షులు మాధవరెడ్డి, నరేందర్ గౌడ్, రామచంద్రం, జిల్లా బాధ్యులు కమ్మరి రవి, గద్దె రాజు, దాసు ప్రభాకర్, అచ్చన్నపల్లి లక్ష్మీనారాయణ, మాకం రాజు, సల్లారం నరేందర్ రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.