Illegal Constructions | జిన్నారం, మే 18: జిన్నారం మండలం గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలో సాగుతున్న పలు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ వాసులు ఇవాళ ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గ్రామస్తులు నారబోయిన శ్రీనివాస్, ఎంపీ.బాలయ్యలు మాట్లాడుతూ.. అలీ నగర్ గ్రామం తెలంగాణ కాలనీ సర్వే నెంబర్ 27లో అదేవిధంగా సర్వేనెంబర్ 10 కాలనీల్లో అక్రమ నిర్మాణాలు రాత్రికి రాత్రే జోరుగా సాగుతున్నాయన్నారు.
ప్రభుత్వ, అసైన్మెంట్ భూముల్లో కొందరు రియల్ వ్యాపారులు వెంచర్ల రూపంలో ఫ్లాట్లు నిర్మించి విక్రయిస్తున్నారని అధికారులకు విన్నవించారు. ఈ అక్రమ బాగోతంపై రెవెన్యూ యంత్రాంగానికి పలుమార్లు ఫిర్యాదు చేసినా తూతూ మంత్రంగా కూల్చివేతలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు.
మున్సిపాలిటీలోని ప్రభుత్వ, అసైన్మెంట్ భూములను అక్రమార్కుల నుంచి కాపాడాలని, ఇట్టి భూములను పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్‌కు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్లోని ప్రభుత్వ భూముల పరిరక్షణకు సరైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.