BRS Protest | జహీరాబాద్, ఫిబ్రవరి 1 : బీఆర్ఎస్ ప్రశ్నించినప్పుడల్లా ఫోన్ ట్యాపింగ్ కేసులు, కాళేశ్వరంపై విచారణ, ఫార్ములా రేసుపై విచారణ అంటూ రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చేలా కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నదని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు విమర్శించారు. సింగరేణిలో జరుగుతున్న వందల కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణం వెలుగులోకి రాగానే.. ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతుందని ఆరోపించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు ఆదివారం జహీరాబాద్ పట్టణంలో ప్రధాన వీధుల గుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్ల కండువాలను ధరించి నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం బస్టాండ్ ఆవరణలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ.. రాష్ర్టాన్ని ప్రగతి పథంలో నడిపించిన కేసీఆర్ను నోటీసుల పేరిట వేధింపులకు గురిచేయడం, కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకీ వచ్చిన సీఎం రేవంత్రెడ్డి కేసీఆర్పై లేనిపోని కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేయాలని చూస్తుండగా.. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో హస్తం పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు.
బీఆర్ఎస్ నాయకుల ధర్నాతో వాహనాల రాకపోకలు నిలిచిపోవడం పట్ల పోలీసులు ఆందోళన విరమించాలని కోరడంతో కార్యకర్తలు నిరాకరించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో ఎమ్మెల్యే మాణిక్ రావు, పలువురు ముఖ్య నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అలాగే మండల కేంద్రమైన న్యాల్కల్ , మొగుడంపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీలను నిర్వహించి ధర్నా చేపట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో కేసీఆర్ను వేధింపులకు గురిచేయడాన్ని నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, ఆయా మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, రవీందర్, సంజీవరెడ్డి, నాయకులు తంజీం, నామ రవి కిరణ్, మిథున్ రాజ్, బండి మోహన్, మోహిజోద్దీన్, హీరో రాథోడ్, భాస్కర్, రాజ్ కుమార్, రవికుమార్, రాజు పటేల్, ప్రవీణ్ కుమార్, ఇసం పటేల్, వెంకట్, శివరాజ్, గౌసుద్దీన్ సర్పంచులు శ్రీకాంత్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, అశోక్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

