SHah Rukh Khan | గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ తన సినీ ప్రయాణంలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు ప్రముఖులపై ప్రశంసలు కురిపించారు. తన జీవితాన్ని కెరీర్ను పూర్తిగా మార్చేశారంటూ యష్ రాజ్ ఫిలిమ్స్ ఆధినేత, ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఆదిత్య చోప్రా, సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్లను ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు.
తొలుత తాను విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లాలని భావించిన సమయంలో అర్ధరాత్రి వేళ ఆదిత్య చోప్రా తనతో ఫోన్లో మాట్లాడి ‘దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయాలని, దర్శకత్వ రంగంలోనే అడుగుపెట్టాలని పట్టుబట్టారని కరణ్ గుర్తుచేసుకున్నారు. ఆ మాటలే తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేశాయని, మరుసటి రోజు ఉదయం తన తండ్రి యశ్ జోహార్ వద్దకు వెళ్లి సినిమా రంగంలో ఒక సంవత్సరం గడిపేందుకు అనుమతి కోరానని తెలిపారు. ఇక రెండో మలుపుగా స్విట్జర్లాండ్లోని ఒక పర్వత ప్రాంతంలో షూటింగ్ సమయంలో షారుఖ్ ఖాన్ తనతో మాట్లాడుతూ.. నువ్వు కచ్చితంగా డైరెక్టర్ అవుతావు, నీ మొదటి సినిమాను నేను చేస్తాను అని ధైర్యం చెప్పారని కరణ్ భావోద్వేగానికి గురయ్యారు.
ఆ సమయంలో షారుఖ్ కేవలం సరదాగా అంటున్నాడని తాను భావించినప్పటికీ, భారత్కు తిరిగొచ్చిన తర్వాత ఆయన తన తండ్రికి కూడా ఆ విషయాన్ని చెప్పి మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. ఆదిత్య చోప్రా మరియు షారుఖ్ ఖాన్ తనపై ఉంచిన నమ్మకమే తనను ఈరోజు ఈ స్థాయిలో ఒక కథా రచయితగా, దర్శకుడిగా నిలబెట్టిందని ఆయన కొనియాడారు. వారిద్దరి అండదండలు, నమ్మకమే తన బలాలు, విజయాలు, ఓటములన్నింటికీ మూలమని పేర్కొంటూ గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, షారుఖ్ ఖాన్ హీరోగా కాజోల్, రాణి ముఖర్జీ నటిగా కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ‘కుచ్ కుచ్ హోతా హై’ సినిమాతోనే ఆయన దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే.