SP DV Srinivas Rao | మెదక్, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలో పెట్రోల్, డీజిల్‌ను డబ్బాలు, ప్లాస్టిక్ కంటైనర్లు లేదా వాటర్ బాటిళ్లలో పోయడాన్ని పూర్తిగా నిషేధించామని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంధనాన్ని డబ్బాల్లో నిల్వ చేయడం వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించే ప్రమాదం అధికంగా ఉంటుందని హెచ్చరించారు.
ప్రజల భద్రత దృష్ట్యా ఎవరూ కూడా పెట్రోల్, డీజిల్‌ను ఇంట్లో లేదా ఇతర ప్రదేశాల్లో డబ్బాలలో నిల్వ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ప్లాస్టిక్ బాటిళ్లలో నిల్వ చేయడం వల్ల లీకేజీలు, అగ్ని ప్రమాదాలు, పేలుళ్లు సంభవించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు చట్టపరమైన సమస్యలకు దారితీసే అవకాశముందని తెలిపారు.
అదేవిధంగా ఈ మేరకు పెట్రోల్ బంక్ డీలర్లకు స్పష్టమైన సూచనలు జారీ చేస్తూ, తమ బంక్ ప్రాంగణంలో ‘డబ్బాలలో పెట్రోల్, డీజిల్ పోయడం నిషేధం’అనే బోర్డులు, బ్యానర్లు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.
బంక్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ఇక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న రెండు పెట్రోల్ బంకులను నెలరోజుల్లో ప్రారంభించి, ప్రజలకు నాణ్యమైన పెట్రోల్, డీజిల్‌ను అందిస్తామని ఎస్పీ తెలిపారు.
4 ఇన్క్లైన్లో హైమాస్ట్ లైట్లు బంద్ చేసే వారే లేరా?
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి : నల్లగొండ డిప్యూటీ మేయర్ ఆశ్రఫ్ అలీ