Indiramma Houses | టేక్మాల్, జూన్ 28 : ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినా.. నాయకుల ప్రాబల్యం ఉన్నవారికే ఇళ్లు మంజూరు అయ్యాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు కాంగ్రెస్ పార్టీలో అసమ్మతికి దారి తీస్తోంది. ఇళ్ల కేటాయింపులో తమకు ప్రాధాన్యత ఎక్కడ అని బహిరంగంగానే ప్రశిస్తున్నారు. మండల కేంద్రమైన టేక్మాల్‌లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన 41 మంది లబ్దిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను ఇవ్వడానికి గ్రామపంచాయతీ ఆవరణలో సమావేశం ఏర్పాటు చేశారు.
ప్రొసీడింగ్ పత్రాలను అందజేయడానికి మంజూరైన లబ్దిదారుల పేర్లను ప్రకటించారు. అందులో కొందరు అనర్హులు ఉన్నారని, వారికి ఇళ్లు ఉన్నప్పటికిని కాంగ్రెస్ నాయకులు సూచించిన వారికే ఇళ్లను కేటాయించడం సరికాదన్నారు. ఇన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, పార్టీ కష్టకాలంలో సైతం పార్టీకి వెన్నంటి ఉన్న తాము ఇందిరమ్మ ఇల్లుకు అర్హులమైనప్పటికిని, తమను కాదని అనర్హులు, ఇళ్లు ఉన్నవారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పార్టీకి విధేయులుగా ఉన్నా, మండల నాయకుల మెప్పు పొందిన వారినే లబ్దిదారులుగా ఎంపిక చేశారని వాపోయారు.
కాంగ్రెస్ నాయకుల అనుచరులకే ప్రాధాన్యత..
మరో వైపు ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికలో అర్హులైన వారిని విస్మరించి కాంగ్రెస్ నాయకుల అనుచరులకు, వారు సూచించిన వారికే ప్రాధాన్యత ఇచ్చారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం దేశారు. ఇళ్లు లేని తమను కాదని, ఇళ్లు ఉన్న అధికార పార్టీ ఆనుచరులకే కేటాయించడం సరైంది కాదన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విస్మరించి అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో మెలిగే వారికే ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులుగా ఎంపిక చేయడం జరిగిందని విమర్శించారు. ఆర్హులైన వారికి ఇళ్లు వచ్చేలా చూస్తామని అధికార పార్టీ నేతలు సముదాయించే ప్రయత్నం చేసినా ప్రజలు సద్దుమణిగారు కానీ అధికార పార్టీ కార్యకర్తలు, వారి అనుచరుల్లో ఒకింత అసమ్మతి వ్యక్తమవుతోంది.
Harish Rao | తెలంగాణ వాది స్వేచ్ఛ అకాల మరణం ఎంతో బాధాకరం : హరీశ్‌రావు
Operation Sindhu | ఆపరేషన్ సింధు ద్వారా 4,415 మంది భారతీయుల్ని తరలించాం : కేంద్రం