Eyelashes | ముఖం అందంగా కనిపించడంలో కనురెప్పలు ముఖ్య పాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు. కనురెప్పలు అందంగా కనిపించడానికి మస్కారా, ఐ లాషెస్ వంటి వాటిని వాడుతూ ఉంటారు. అయితే వీటిలో రసాయనాలు ఎక్కువగా ఉండడం వల్ల కంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కనురెప్పల వెంట్రుకలు రాలిపోయి పలుచగా తయారయ్యే అవకాశం కూడా ఉంది. వీటికి బదులుగా కొన్ని సహజమైన ఇంటి చిట్కాలను పాటించడం వల్ల కనురెప్పలను నల్లగా, ఒత్తుగా, ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. ఈ చిట్కాలను వాడడం వల్ల కంటికి ఎటువంటి హాని కలగదు. కనురెప్పల అందాన్ని మరింత పెంచే ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కలబంద జెల్ కనురెప్పలకు తేమను అందిస్తుంది. దీనిని కొద్దిగా కనురెప్పలపై రాసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల కనురెప్పలు ఒత్తుగా, అందంగా తయారవుతాయి. కలబంద జెల్ రాయడం వల్ల కనురెప్పలపై మంట కూడా తగ్గుతుంది. చల్లారిన గ్రీన్ టీని కనురెప్పలపై కాటన్ ప్యాడ్ తో రాయాలి. ఇలా చేయడం వల్ల గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కనురెప్పల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. అంతేకాకుండా గ్రీన్ టీ రాయడం వల్ల అలసిపోయిన కళ్లకు ఉపశమనం లభిస్తుంది. కళ్ల వాపు తగ్గుతుంది. కనురెప్పలు అందంగా కనిపించడానికి మేకప్ వేస్తూ ఉంటారు. ఐ లాషెస్ ను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వీటిని తొలగించడం ఒక పెద్ద సమస్య అని చెప్పవచ్చు. కనురెప్పలు రుద్దకుండా, లాగకుండా సున్నితంగా మేకప్ ను తొలగించాలి. అప్పుడే కనురెప్పలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. కనురెప్పలపై మేకప్ ను తొలగించడానికి ఆయిల్ ఉండే రిమూవర్ లను ఉపయోగించడం మంచిది.
కనురెప్పలు ఒత్తుగా తయారవ్వడంలో ఆముదం ఎంతో సహాయపడుతుంది. ఆముదం నూనెలో పోషకాలు, మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కనురెప్పల పెరుగుదలను ప్రోత్సహించడంలో, వాటినిబలోపేతం చేయడంలో సహాయపడతాయి. నిద్రించే ముందు ఒక చుక్క ఆముదం నూనెను కనురెప్పలపై సున్నితంగా రాయాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలను చూడవచ్చు. ఆముదం నూనె లాగా కొబ్బరి నూనె కూడా కనురెప్పలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. కొబ్బరి నూనె రాయడం వల్ల కళ్ల చుట్టూ ఉండే సున్నితమైన చర్మంపై చికాకు తగ్గుతుంది. రోజూ రాత్రి పడుకునే ముందు కనురెప్పలపై కొద్దిగా కొబ్బరి నూనె రాసి సున్నితంగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల కనురెప్పలు, ఆరోగ్యంగా, అందంగా తయారవుతాయి.
విటమిన్ ఇ నూనె కూడా కనురెప్పలను బలంగా, ఒత్తుగా చేయడంలో దోహదపడుతుంది. విటమిన్ ఇ క్యాప్సుల్స్ ను కనురెప్పలపై రోజుకు ఒకసారి రాయాలి. ఇలా చేయడం వల్ల కనురెప్పలు ఒత్తుగా తయారవుతాయి. అలాగే రసాయనాలు ఎక్కువగా, కఠినంగా ఉండే మస్కారా వంటి వాటిని వాడడం వల్ల వెంట్రుకలు బలహీనంగా తయారయ్యే అవకాశం ఉంది. కనుక సున్నితంగా, రసాయనాలు తక్కువగా ఉండే మేకప్ ను ఉపయోగించడం మంచిది. వీటితో పాటు ప్రోటీన్, విటమిన్స్, బయోటిన్ ఎక్కువగాఉండే ఆహారాలను తీసుకోవాలి. ఇవి వెంట్రుకలను బలంగా తయారు చేయడంలో సహాయపడతాయి. ఇక లాష్ సీరమ్ ను ఉపయోగించడం వల్ల కూడా కనురెప్పలు అందంగా, బలంగా, ఒత్తుగా తయారవుతాయి. అయితే సహజ పదార్థాలు ఉన్న సీరమ్ ను ఉపయోగించే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా సహజ చిట్కాలను ఉపయోగించి కూడా కనురెప్పల అందాన్ని మరింత రెట్టిపు చేసుకోవచ్చు.