Employment Guarantee Work | జహీరాబాద్, మార్చి 17 : ఉపాధి హామీ పథకంలో పని చేసే కార్మికులు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఎన్ఐసి సాఫ్ట్‌వేర్‌ను 2021 నుంచి అమలు చేస్తున్న విషయం విదితమే. అప్పటి నుంచి ఉపాధి పనులకు సంబంధించి నిబంధనలలో అనేక మార్పులు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో వేసవిలో ఇచ్చే అలవెన్సులతోపాటు ఇతర సౌకర్యాలకు కోత విధించారు. రెండు వారాలుగా వేసవి నేపథ్యంలో ఉదయం 8 గంటలకు సూర్యుడు తన ప్రతాపం చూపుతున్న విషయం విదితమే.
అలాంటి మండుటెండల్లోనే ఉపాధి హామీ కూలీలు పని చేయాల్సిన పరిస్థితి నెలకొంటోంది. కూలీలు ఎండ బారిన పడి అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు ఉన్నాయి. జిల్లాలో ఎండల తీవ్రతను బట్టి ఉపాధి హామీ కూలీలకు పని చేసే చోట కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. వేసవి నేపథ్యంలో కనీసం టెంట్లు, తాగడానికి మంచి నీటి వసతిని కూడా కల్పించడం లేదని కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాగు నీరు సైతం ఇంటి వద్ద నుంచి వెంటతెచ్చుకోమని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతీ సంవత్సరం ఉపాధి హామీ కూలీలకు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం నెరవేర్చడం లేదు. జహీరాబాద్ క్లస్టర్ పరిధిలో ఉపాధి హామీ పథకం ద్వారా ఆయా మండలాల్లో 73,406 జాబ్‌కార్డులు ఉన్నాయి. వీరిలో 48,410 మాత్రమే యాక్టివ్ వర్కర్స్ జాబితాలో ఉన్నారు. వీరందరికీ పని దినాలు కల్పించడమే లక్ష్యంగా డ్వామా విభాగం లక్ష్యాలను పెట్టుకొని ఉపాధి హామీ పనులను చేయిస్తోంది.
కానీ ఉపాధి హామీ పనులు చేసే చోట కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతోంది. ఉదయం 8 గంటలకే ఎండలు విపరీతంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇతరత్రా పనులు చేసేందుకు బయటకు వెళ్లాలనుకున్న వారు 10 గంటలలోపు ముగించుకొని ఇళ్లకు చేరుకుంటున్నారు.
‘ఉపాధి’ కూలీలకు తప్పని అవస్థలు..
ఉపాధి హామీ పనులు చేసే చోట నీడ వసతి, నీటి సౌకర్యాలు లేకపోవడంతో కూలీలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎర్రటి ఎండలో పని చేసిన కూలీలు కొద్ది సేపైనా సేద తీరడానికి టెంట్లు వేయాల్సి ఉంది. కానీ ఎక్కడ టెంట్లు వేయకపోవడంతో కూలీలకు స్థానికంగా నిలువ నీడ కరువవుతోంది. చెట్ల కిందికి వెళ్లి సేద తీరుతున్నారు.
పని చేసే చోట నీటి సౌకర్యం లేక ఎండలకు వేడిగా అవుతోంది. దీంతో ఆ నీటిని తాగలేకపోతున్నారు. ఎండదెబ్బ తగిలి స్థానికంగా స్పృహ కోల్పోతే ప్రథమ చికిత్సకై ఫస్ట్ ఎయిడ్ కిట్లు కూడా ఉండడం లేదు. నీటితో పాటు ఒఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. అధికారులు నీడ, నీటి వసతితో పాటు ఫస్టేడ్ కిట్లు అందుబాటులో ఉంచాలని కూలీలు కోరుతున్నారు.
వడదెబ్బ తగల కుండా జాగ్రత్తలు తీసుకోవాలి : గణపతి రావు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్, న్యాల్కల్
ఎండాకాలం కూలీలు వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అందుకే కూలీలు ఉదయం 11 గంటల వరకు పనులు ముగించుకోవాలి. తలకు ఎండ తగలకుండా టవల్ చుట్టుకోవాలి. నిమ్మరసం, మజ్జిగ లాంటివి ఎక్కువ తీసుకోవాలి. తెల్లటి కాటన్ దుస్తులు వేసుకోవాలి. ఎండకు వడదెబ్బకు గురైతే ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కోక తప్పదు.
మెడికల్ కిట్లు అందజేస్తాం : రంగారావు, ఏపీఎం న్యాల్కల్
ఉపాధి హామీ కూలీలకు తాగునీరు సరఫరా చేసే బాధ్యత గ్రామ పంచాయతీలకు అప్పగించింది. పని ప్రదేశంలో నీడ కోసం ఏర్పాటు చేసే టెంట్లను ప్రభుత్వం నిలిపి వేసింది. పని ప్రదేశంలో మెడికల్ కిట్లను అందుబాటులో ఉండే విధంగా చూస్తాం. ప్రథమ చికిత్సకు అవసరమయ్యే సామాగ్రిని అందిస్తాం. ఎండల నుంచి రక్షణ కల్పించడానికి ఓఆర్ఎస్ పాకెట్లను అందజేస్తాం.
Read Also :
HYDRAA | బండ్లగూడలో హైడ్రా కూల్చివేతలు
ASP Chittaranjan | విద్యార్థులు ఒత్తిడిని అధిగమిస్తేనే విజయం తథ్యం : ఏఎస్పీ చిత్తరంజన్
Harish Rao | కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్: హరీశ్‌రావు