‘సీతా పయనం’ ఓ డిఫరెంట్ జానర్. నా కూతుర్ని పాజిటివిటీ ఉన్న ఓ మంచి కథతో పరిచయం చేయాలనుకున్నాను. దానికి కార్యరూపమే ఈ సినిమా. ఇది నా కుమార్తెకు నేనిస్తున్న బహుమతి. ఇందులో ఐశ్వర్యను చూసి అంతా మెచ్చుకుంటారు. ముఖ్యంగా సత్యరాజ్ కాంబినేషన్ సీన్స్ ఈ సినిమాకు హైలైట్. నిరంజన్ అద్భుతంగా నటించాడు. ప్రతి ఒక్కరూ ప్రేమించేలా ప్రకాష్‌రాజ్ పాత్ర ఉంటుంది. నేను, ధృవ అతిథిపాత్రల్లో కనిపిస్తాం. సాంకేతికంగా అన్ని విధాలా సినిమా ఆకట్టుకుంటుంది.’ అని అర్జున్ సర్జా అన్నారు.
ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘సీతా పయనం’. నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కిన ఈ ఫీల్‌గుడ్ ప్రేమకథ ఈ నెల 14న ప్రేమికుల రోజు కానుకగా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో అర్జున్ మాట్లాడారు. ప్రముఖ నటుడు బ్రహ్మానందం ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ఇది తనకు కేవలం సినిమా మాత్రమే కాదని, ఓ ఎమోషన్ అనీ ఐశ్వర్య అర్జున్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సినిమాలో భాగం కావడం పట్ల హీరో నిరంజన్ ఆనందం వెలిబుచ్చారు. ఇంకా చిత్రబృందమంతా మాట్లాడారు.