Padma Devender Reddy | మెదక్ జిల్లా, ఫిబ్రవరి 16 : కాంగ్రెస్ పార్టీ నేతలు ఢిల్లీలో కుస్తీ పడుతూ గల్లీలో బీజేపీతో దోస్తానా చేసి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కౌన్సిలర్లను చైర్మన్ చేసేందుకు మద్దతు తెలిపారని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, ఫరూక్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి ఆరోపించారు.
సోమవారం మెదక్ పట్టణంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. మెదక్ నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ, బీఎస్పీ జాతీయ పార్టీలు మద్దతు ఇవ్వడం ఇందుకు నిదర్శనం అన్నారు. మెదక్ పట్టణంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోసం నిర్వహించిన కోరంలో బీజేపీ సభ్యులు ఉండి, చైర్మన్ ఎన్నిక చేసే సమయంలో బయటకు వెళ్లిపోయారని తెలిపారు. కోరం లేకపోతే చైర్మన్ ఎన్నిక వాయిదా పడేదని, కోరం కోసం బీజేపీ సభ్యులు కాంగ్రెస్కు మద్దతు తెలిపారని ఆరోపించారు.
జాతీయ పార్టీ బీఎస్పీ కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఢిల్లీలో కొట్లాడుతూ గల్లీలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు మద్దతు ఇవ్వడంపై మండిపడ్డారు. మూడు జాతీయ పార్టీలు ఒకటేనని మున్సిపల్ ఎన్నికల్లో తేలిపోయిందన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో నైతిక విజయం సాధించిందన్నారు. ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామన్నారు.
కాంగ్రెస్ పార్టీ అరాచకాలతో ప్రజలు విసుగు చెంది. మెదక్ లో బీఆర్ఎస్ కు అత్యధిక స్థానాలలో గెలిపించారన్నారు. ఈ సమావేశంలో మెదక్ నియోజకవర్గం బీఆర్ఎస్ తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డితోపాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Peddapalli | కోరం లేక వాయిదా పడ్డ సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నిక
‘ఎంజీయూ విద్యార్థులకు కనీస వైద్య సదుపాయాలు కరువు’