Farmers | నర్సాపూర్, అక్టోబర్ 30 : వర్షాలకు కొనుగోలు కేంద్రాలలో ధాన్యం మొలకెత్తుతున్నా ప్రభుత్వానికి, అధికారులకు దయ కలగడం లేదా అని తెలంగాణ రైతు రక్షణ సమితి ముఖ్య సలహాదారుడు మిరియాల చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్న చింతకుంట, పెద్ద చింతకుంట గ్రామాలలోనీ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని ఆయన రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు పత్రాల యాదాగౌడ్తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొనుగోలు కేంద్రాలలో ధాన్యం పూర్తిగా తడిసి మొలకలు ఎత్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకో నాలుగు రోజులు ధాన్యం ఇలాగే ఉంటే దేనికి పనికి రాకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి వారం రోజులు గడిచిపోయినా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం దురదృష్టకరమన్నారు.
మొలకెత్తిన ధాన్యాన్ని చూస్తూ రైతులు గుండెలు బాదుకుంటున్నారని వారి ఆవేదనను చూడతరం కావడం లేదని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు ఎలాంటి ఆలస్యం చేయకుండా.. ఎలాంటి షరతులు విధించకుండా తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.



Hot Fish Curry: భార్య ముఖంపై వేడి చేపకూర చల్లిన భర్త
Quality Seeds | నాణ్యమైన విత్తనాలతో పంట దిగుబడి .. రైతులకు అవగాహన