Padma Devender Reddy | మెదక్ అర్బన్, (నమస్తే తెలంగాణ) ఏప్రిల్ 14 : విద్యుత్ ఆర్టిజెన్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ జిల్లాలో గత 7 రోజులుగా కొనసాగుతున్న ఆర్టిజన్ కార్మికుల సమ్మెలో పాల్గొని కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, విద్యుత్ కార్మికుల సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని అన్నారు. ఇప్పటికే వారం రోజులుగా సమ్మె కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు. కార్మికులు ఏపీఎస్ఈబీ నిబంధనలను యథాతథంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే కార్మికులతో చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చూపాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున కార్మికులకు అండగా నిలిచి పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.
రాష్ట్రానికి విద్యుత్ రంగం కీలకమని పేర్కొంటూ, విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క వెంటనే స్పందించి కార్మికులను చర్చలకు ఆహ్వానించాలని కోరారు.
రాష్ట్రంలో ప్రస్తుత పాలనపై విమర్శలు గుప్పించిన ఆమె, విద్యుత్ కార్మికులు ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ నిలుస్తుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మామిళ్ల ఆంజనేయులు, న్యాయవాది జీవన్ రావు, మున్సిపల్ కౌన్సిలర్లు దీపక్ కుమార్, జుబెర్ అహ్మద్, ఉదయ్ కుమార్,మెదక్ మండల పార్టీ అధ్యక్షులు అంజ గౌడ్, నాయకులు పూసల సంతోష్ సునీల్, ఇంతియాజ్ మోహన్, మహిళా నాయకురాలు చంద్రకళ, రాధ , విద్యుత్ కార్మికులు నాగరాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పద్మా దేవేందర్ రెడ్డి ప్రసంగం..
Ambedkar Jayanti | తెలంగాణభవన్‌లో అంబేద్కర్‌కు ఘన నివాళులు.. ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్
Alia Bhatt | ‘డ్రాగన్’ కోసం ఆలియా?.. ప్రశాంత్ నీల్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ!
KTR | ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ సర్కారు చేసిన మోసాన్ని ఎండగడుదాం : కేటీఆర్