హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : న్యాయవివాదాలను సాకుగా చూపు తూ తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (పీఆర్ఎల్ఐఎస్) జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభు త్వం మెలిక పెట్టింది. డీపీఆర్‌ను పరిశీలించలేమని, ఇప్పటికే తిప్పిపంపినట్టు స్పష్టంచేసింది. రాజ్యసభ వేదికగా కేంద్రం ఇదే విషయాన్ని మరోసారి తేల్చిచెప్పింది. పీఆర్ఎల్ఐఎస్కు జాతీయ ప్రాజెక్టు హోదానిచ్చే ప్రతిపాదన కేంద్రం పరిశీలనలో ఉన్నదా? డీపీఆర్ పరిశీలన తదితర అంశాలపై స్టేటస్ ఏమిటి? నేషనల్ ప్రాజెక్టు హోదాకు ఉండాల్సిన నిబంధనలేమిటి? తదితర వివరాలను వెల్లడించాలని కేంద్రాన్ని రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి కోరారు. ఆ ప్రశ్నలకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌భూషణ్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కృష్ణా జలాల వినియోగం, అంతర్రాష్ట్ర వివాదాలపై ప్రస్తుతం ట్రిబ్యునల్ పరిధిలో విచారణలో ఉన్నాయని, ఈ నేపథ్యంలో టెక్నో-ఎకనామిక్ అప్రైజల్ చేపట్టలేమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. డీపీఆర్‌ను సైతం సమగ్ర ప్రణాళిక కోసం తెలంగాణ ప్రభుత్వానికి తిరిగి పంపినట్టు మరోసారి స్పష్టంచేశారు. ప్రాజెక్టుకు జాతీయ హోదాను ప్రకటించే అంశం కేంద్రం పరిశీలనలోనే లేదని తెలిపారు. ఇతర పథకాల కింద ఆర్థిక సాయం చేసే అంశంపై ఎలాంటి నిర్దిష్ట హామీనివ్వలేదని పేర్కొన్నారు.
సాధారణంగా ఏదైనా రాష్ట్రం బహుళార్థక ప్రయోజనాలతోకూడిన, ఎక్కువ మొత్తం జనాభాకు లబ్ధి చేకూర్చే సాగునీటి ప్రాజెక్టును చేపట్టినప్పుడు వాటికి కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ప్రకటిస్తుంది. ఫలితంగా ఆ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మొత్తాన్ని కేంద్రమే భరిస్తుంది. ఏదైనా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలంటే అందుకు కేంద్రం కొన్ని మార్గదర్శకాలను విధించింది. ఆ నిబంధనలను సైతం కేంద్రమే తుంగలో తొక్కుతూ రాజకీయ ప్రయోజనాలే ప్రధాన ఎజెండాగా తన విధానాలను కొనసాగిస్తున్నది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరం, కెన్-బెత్వా, అప్పర్‌భద్ర ప్రాజెక్టులకు జాతీయ హోదాను ప్రకటించింది. అందులో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014లో పేర్కొన్నారని చెబుతూ పోలవరం ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదాను కట్టబెట్టింది. ఇప్పటికీ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ముంపు, పునరావాస చర్యలపై సుప్రీంకోర్టులో అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
తెలంగాణ ప్రాంతంలోనూ ముంపు సమస్యను పరిష్కరించలేదు. వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం సొంతంగా కెన్ బెత్వా రివర్ లింక్ ప్రాజెక్టుకు నేషనల్ స్టేటస్ ప్రకటించింది. కానీ, ప్రాజెక్టుకు ఇప్పటికీ అనుమతులు పొందలేదు. అనేక వివాదాలు కొనసాగుతున్నాయి. జాతీయ హోదా పొందిన మరో ప్రాజెక్ట్ అప్పర్‌భద్రకు ట్రిబ్యునల్-1 నీటిని కేటాయించలేదు. ట్రిబ్యునల్-2 నీటిని కేటాయించినా ఆ అవార్డు ఇంకా అమల్లోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఒక ప్రాజెక్టును చేపట్టాలంటే ఆ నది ప్రవహించే రాష్ర్టాల అంగీకారం తీసుకోవడం తప్పనిసరి. అయినప్పటికీ, కర్ణాటక ప్రభుత్వం ఆ నిబంధనలను తుంగలోకి తొక్కింది. ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా, ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా కేవలం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా అప్పర్‌భద్ర, అప్పర్‌తుంగ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేసుకున్నది. దానిని నిలదీయాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయకపోగా, ఏకంగా అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించింది.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆదినుంచీ తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపుతున్నది. నిధుల కేటాయింపు, జాతీయ సంస్థల మంజూరు, సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ప్రకటించడంలోనూ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరిస్తున్నది. అందుకు అనుగుణంగానే ఎప్పటికప్పుడు విధానాలను మార్చుకుంటున్నది. బీజేపీ పాలిత, కూటమి రాష్ర్టాలకే పట్టం గడుతున్నది. నిజానికి జాతీయ హోదా పొందడానికి అవసరమైన ఆ ప్రమాణాలన్నింటికీ కాళేశ్వరం ప్రాజెక్టు సరితూగుతుంది. అంతేకాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. అయినప్పటికీ, కేంద్రం ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం లేదు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయడంతో పాటుగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగునీటిని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇచ్చే అర్హతలు, అవకాశం ఉన్నా ఆ పనీచేయడం లేదు. అనేకమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న పాపానలేదు. ప్రాజెక్టును చేపట్టింది మొదలు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రధాని మోదీకి విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. కెన్ బెత్వా ప్రాజెక్టులకు జాతీయ హోదా ప్రకటించిన సందర్భంలో కాళేశ్వరం, పీఆర్ఎల్ఐఎస్ ప్రాజెక్టుల్లో ఏదో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని అప్పటి బీఆర్ఎస్ సర్కార్ డిమాండ్ చేయగా, ‘ఇకపై ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చే విధానం ఉండబోదు. ఏ ప్రాజెక్టుకూ నేషనల్ స్టేటస్ ఇచ్చేది లేదు’ అంటూ కేంద్రమే పార్లమెంట్ వేదికగా చెప్పింది. కానీ, అందుకు విరుద్ధంగా ఎన్నికల ముందు కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు జాతీయహోదా ప్రకటించింది. ఇదీ కేంద్రం అనుసరిస్తున్న ద్వంద్వనీతి.