Harish Rao | మెదక్/చేగుంట: కొనుగోలు కేంద్రాల్లో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నా.. రేవంత్ రెడ్డికి కనీస కనికరం లేదు.కాంగ్రెస్ వాళ్లే కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చునని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. చేగుంట మండలం కర్ణాల్పల్లి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..రేవంత్ రెడ్డి ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో దారుణంగా ఫెయిల్ అయ్యింది. రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారిందన్నారు.కర్ణాల్పల్లిలో కొనుగోలు కేంద్రం ప్రారంభించి 25 రోజులైంది. ఇప్పటివరకు కేవలం రెండే లారీలు వచ్చాయి.పది రోజులకు ఒక లారీ వస్తే ఈ వడ్లన్నీ ఎప్పుడు కొనాలి.? అని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలకు వడ్లు తడిసి, మళ్లీ ఆరబెట్టినా కొనలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఏ గ్రామానికి పోయినా రైతులు కల్లాల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు.. ఇంతవరకు వడ్ల కొనుగోళ్లపై ఒక్క రోజైనా కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టారా? మీ మంత్రులతో ఒక్క మీటింగ్ అయినా చేశారా..?మీకు ఢిల్లీకి పోవడం, హైదరాబాద్ కు రావడం తప్ప వేరే పనే లేదా? ఢిల్లీకి వెళ్లి కప్పం కట్టడం తప్ప.. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతుల కష్టాలు ముఖ్యమంత్రికి, మంత్రులకు పట్టవా..? అని ప్రశ్నించారు.
మెదక్ జిల్లాలో ఇప్పటివరకు ఏ ఒక్క మంత్రి అయినా వడ్ల కొనుగోళ్లపై సమీక్ష చేశారా..?ఈ ప్రభుత్వానికి రైతులంటే లెక్క లేదు, పట్టింపు లేదు, చిన్నచూపు ఉన్నందు వల్లే ఈ దుస్థితి దాపురించింది. ఏసీ రూముల్లో కూర్చుని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారు. ఆయన ఒకసారి పోలీసులను పక్కనపెట్టి రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు తిరిగితే రైతుల కన్నీళ్లు, కష్టాలు ఏంటో అర్థమవుతాయి.అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆ పార్టీ సర్పంచులే ఇవాళ వడ్లు కొనాలని కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తున్నారు. అంటే మీ ప్రభుత్వ పరిస్థితి ఎంత దయనీయంగా, దారుణంగా తయారైందో ఒకసారి అర్థం చేసుకోవాలి.
ప్రతిపక్ష నాయకులు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తే కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్న ముఖ్యమంత్రికి.. రైతుల బాధల గురించి ఇంటెలిజెన్స్, పోలీసులు నివేదికలు ఇవ్వడం లేదా..?మక్కలు, శనగలు, సన్ ఫ్లవర్ అమ్మిన రైతులకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా వేయలేదని హరీష్ రావు అన్నారు. జొన్నల కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభమే కాలేదు.35 రోజుల నుంచి సన్ ఫ్లవర్ కొనుగోళ్లు ఆగిపోయాయి. కుప్పల కింద ఆ పంటకు చెదలు పడుతున్నా ప్రభుత్వానికి కనికరం లేదు.సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో జరిగిన అవినీతి వల్లే నేడు అది దివాలా తీసింది. ఆ సంస్థ NPA కావడంతో బ్యాంకులు అప్పులివ్వడం లేదు.దాంతో దొడ్డిదారిన కోఆపరేటివ్ బ్యాంకు నుంచి మార్క్ ఫెడ్ కు, అక్కడి నుంచి సివిల్ సప్లైస్ కు డబ్బులు మళ్లించారు. మీ అవినీతి, తప్పులకు రైతులను బలిచేస్తున్నారు. రేషన్ షాపుల్లో ఏళ్ల తరబడి నిల్వ ఉన్న సుమారు రూ. 500 కోట్ల విలువైన దొడ్డు బియ్యం పురుగులు పట్టి ముక్కిపోయాయి.
వాటిని అమ్మి రికవరీ చేయాలన్న కనీస సోయి, బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి లేదన్నారు.ముఖ్యంగా చేగుంట మండలంలోని 10 గ్రామాల్లో వడగండ్ల వాన వల్ల పంటలకు తీవ్ర నష్టం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక వరుసగా మూడు యాసంగి సీజన్లలో రైతులు నష్టపోతూనే ఉన్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే మేల్కొని లారీలు పంపించి, కాంటాలు పెట్టి వడ్లు కొనాలి. లేదంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులం అంతా కలెక్టరేట్లను ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు. హరీష్‌రావుతోపాటు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి , మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
TN CM Vijay | తమిళనాడులో కొత్త శకం ప్రారంభమైందన్న విజయ్.. మహిళల భద్రత సహా పలు ఫైళ్లపై సంతకాలు
Anna Lezhneva | మదర్స్ డే సందర్భంగా అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్.. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఫోటో వైరల్
Watch: తలలో దిగిన కొడవలితో ఆసుపత్రికి వెళ్లిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?