హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్టీసీలో రెగ్యులర్ డ్రైవర్ పోస్టుల భర్తీని పక్కకు పెట్టిన ప్రభుత్వం దొడ్డిదారిన ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేపడుతున్నది. రెగ్యులర్ డ్రైవర్ల నియామకానికి నిరుడు సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చినా.. ఆ ప్రక్రియను డ్రైవింగ్ టెస్టుల వరకే పరిమితం చేసి.. రహస్యంగా ఔట్సోర్సింగ్ పద్ధతిలో కొత్తగా డ్రైవర్లను నియమించుకుంటున్నది. ప్రభుత్వ సూచనల మేరకు ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా రీజియన్ల వారీగా తాతాలిక డ్రైవర్లను నియమించేందుకు చర్యలు చేపట్టింది. ఒక హైదరాబాద్ ప్రాంతంలోనే సుమారు 200 మంది డ్రైవర్లను ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన తీసుకోవడానికి ఓముల్లేన్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు బాధ్యత అప్పగించింది. ఇలాగే అన్ని రీజియన్లలో ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఔట్‌సోర్సింగ్‌లో నియామకాలు చేపట్టినట్టు తెలిసింది.
తెలంగాణలోని కొన్ని రీజియన్లలో తక్షణ ప్రాతిపదికన వందలాది మంది డ్రైవర్ల నియామానికి ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఆధార్, పాన్‌కార్డు, బ్యాంక్ అకౌంట్, డ్రైవర్ బ్యాచ్ నంబర్, 18నెలల అనుభవం కలిగిన హెవీ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్టీఏ క్లియరెన్స్ లెటర్, కుల ధ్రువీకరణ పత్రం ఉండి.. 21 నుంచి 60 ఏండ్ల మధ్య వయస్కులు, ఎత్తు 160 సె.మీ. ఉన్నవారు అర్హులుగా పేర్కొన్నారు. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియమించుకుంటున్న డ్రైవర్లకు నెలకు ప్రారంభవేతనం రూ.21,640 ఇస్తామని ప్రకటిస్తున్నారు. అయితే, నోటిఫికేషన్లో రెగ్యులర్ డ్రైవర్ పోస్టులకు ప్రారంభవేతనం మాత్రం కేవలం రూ.20,960గానే చూపించారు. ఔట్సోర్సింగ్ డ్రైవర్లకు వేతనంతోపాటు ప్రతిరోజూ రూ.400 ఆన్‌డ్యూటీ బత్తా, ప్రతినెలా పీఎఫ్ వెసులుబాటు కూడా ఉన్నదని ప్రకటించారు.
ముఖ్యంగా ప్రతినెలా 1వ తేదీనే వేతనం జమ చేస్తామని హామీలు ఇచ్చి.. రిక్రూట్మెంట్ ప్రక్రియను వేగంగా కొనసాగిస్తున్నారు. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన జరిపే నియామకాలపై ఉన్న శ్రద్ధ.. రెగ్యులర్ నియామకాలపై చూపించడం లేదని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీజీఎస్ ఆర్టీసీలో 1000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టుల భర్తీకి నిరుడు సెప్టెంబర్ 17న నోటిఫికేషన్ వెలువడింది. వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు ఏడాది కావొచ్చినా నియామక ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం డ్రైవర్, శ్రామిక్ పోస్టుల నియామక ప్రక్రియను వేగవంతం చేసి త్వరగా తుది జాబితా ప్రకటించాలని అభ్యర్థులు కోరుతున్నారు.