TN CM Vijay : టీవీకే అధ్యక్షుడు విజయ్ (TVK chief Vijay) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తన తొలి సంతకాన్ని ఉచిత విద్యుత్ (Free Power) ఫైలుపై చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్ ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకంతో అధికారులకు తొలి ఆదేశాలు ఇచ్చారు. తాను హామీ ఇచ్చిన విధంగానే ఇతర ఫైళ్లపై కూడా సంతకాలు చేశారు. సీఎం సంతకం చేయడంతో ఇక తమిళనాడు (Tamil Nadu) లో కూడా 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను వినియోగించే కస్టమర్లకు ఉచితం విద్యుత్ అందించనున్నారు.
ఉచిత విద్యుత్ ఫైలు తర్వాత మహిళా భద్రతపై, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా, ఉచిత బస్సు ప్రయాణం తదితర హామీలకు సంబంధించిన ఫైళ్లపై కూడా సంతకాలు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సి జోసెఫ్ విజయ్‌కు శ్రీలంక అధ్యక్షుడు అభినందనలు తెలిపారు. శ్రీలంక, తమిళనాడు మధ్య ఉన్న గాఢమైన చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు, ప్రజల మధ్య సంబంధాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. భవిష్యత్తులో మరింత ఈ బంధం మరింత బలపడాలని ఆకాంక్షించారు.
ఇదిలావుంటే తమిళనాడులో నిజమైన లౌకిక, సామాజిక న్యాయంతో కూడిన కొత్త శకం ప్రారంభమైందని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ అన్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. యువత తనకు అండగా నిలిచిందని, ఈ విజయ్ ‘మామ’ వారికి అన్నివిధాలా మంచే చేస్తాడని అన్నారు. యువతే తన ప్రాణమని సీఎం తన తొలి ప్రసంగంలో తెలిపారు. తాను మీ ఇంట్లో కుటుంబ సభ్యుడినని, అన్నలా, తమ్ముడిలా ఉంటానని హామీ ఇచ్చారు. తనకు ఓటు వేసి గెలిపించినందుకు యావత్ తమిళ ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు.